Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాఫీ, టీ పొడి , నూనె, గోధుమపిండి వంటి నిత్యావసరాల ధరలు మరో 10-15 శాతం పెరిగే అవకాశముంది. అంతర్జాతీయంగా సరుకుల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో పాటు ప్యాకేజింగ్ ముడిపదార్థాల ధరలూ పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా పరిస్థితులను ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు నిశితంగా గమనిస్తున్నాయి. హెచ్‌యూఎల్, నెస్లే కంపెనీలు గత వారమే కొన్ని ఆహారోత్పత్తుల ధరలను పెంచాయి. వంటనూనెలు, ముడిచమురు ధరలు గతం కంటే పెరిగినా, ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి కొద్దిగా వెనక్కి వచ్చాయి. పామాయిల్ ధర లీటరుకు రూ.180కి చేరినా, ఇప్పుడు రూ.150 వద్ద ఉంది. ముడిచమురు బ్యారెల్ ధర 139 డాలర్లను మించినా, ఇప్పుడు 100 డాలర్ల వద్ద ఉంది. ఈ ధరలు కంపెనీలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్ పరిణామాల అనంతరం గిరాకీ మళ్లీ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడంతో, ఖర్చు విషయంలో ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆహారోత్పత్తుల ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ప్యాకెట్‌కు బదులు సరకు తక్కువ పరిమాణంలో ఉండే చిన్న ప్యాకెట్లను కొనుగోలు చేయడం పెరుగుతోంది. అయితే ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ వ్యయాల రూపేణ తమపై పడుతున్న భారాన్ని కంపెనీలు, వినియోగదార్లకు బదిలీ చేయక తప్పని స్థితి ఏర్పడుతోంద'ని పార్లే ప్రోడక్ట్స్ సీనియర్ కేటగిరీ అధిపతి మయాంక్ షా తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 1-2 నెలలకు సరిపడా ముడిపదార్థాలు, ప్యాకేజింగ్ ఉత్పత్తులున్నందున, ఉత్పత్తుల ధర పెంపుపై ఆ తదుపరి ఆలోచిస్తామన్నారు. ద్రవ్యోల్బణ భారానికి తగ్గట్లు ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని డాబర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుష్ జైన్ తెలిపారు.