Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్
- ప్రభుత్వ రంగంలోని ఖాళీలన్నీ భర్తీ చేయాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ డిమాండ్ చేశారు. సోమవారం రాజ్యసభలో జీరో అవర్లో ఆయన నిరుద్యోగ సమస్యను లేవనెత్తారు. దేశం తీవ్రమైన నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొం టోందనీ, 2021 డిసెంబర్లో దేశంలో 53 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) ఇటీవల ప్రచురించిన డేటా ప్రకారం నిరుద్యోగ సంక్షోభం ఎంతగా ఉన్నదో వెల్లడైందన్నారు. 15 ఏండ్లు పైబడిన వారిలో నిరుద్యోగం రెండంకెల స్థాయికి చేరుకున్నదనీ, ఇది 2021 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో 12.6 శాతానికి చేరుకుందని తెలిపారు. అంతకుముందు జనవరి-మార్చి కాలంలో ఇది 9.3 శాతంగా ఉందని అన్నారు. ఏప్రిల్-జూన్ 2021లో అన్ని వయస్సుల వారి నిరుద్యోగం రేటు 12.7 శాతానికి పెరిగిందని, ఇది జనవరి-మార్చి త్రైమాసికంలో 9.4 శాతమని పేర్కొన్నారు. మహిళా నిరుద్యోగం 14.3 శాతానికి పెరిగిందని, అంతకు ముందు త్రైమాసికంలో ఇది 11.8 శాతం ఉందని అన్నారు. పురుషులలో నిరుద్యోగం 12.2 శాతం నమోదయిందనీ, అంతకుముందు త్రైమాసికంలో ఇది 8.6 శాతమని పేర్కొన్నారు. కార్మికుల జనాభా రేటు 40.9 శాతానికి పడిపోయిందనీ, అంతకుముందు త్రైమాసికంలో ఇది 43.1 శాతమని తెలిపారు. ఈ డేటా అధికారిక ఉద్యోగాల తగ్గుదల ధోరణిని చూపుతుందని చెప్పారు. దీనిని ప్రభుత్వం పరిష్కరించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణతో పరిస్థితి మరింత దిగజారుతుందని విమర్శించారు. ప్రభుత్వం కార్మిక, పారిశ్రామిక విధానాన్ని మార్చుకోవాలని ఎంపీ శివదాసన్ సూచించారు.
సరైన విద్యార్హత లేని వారు ప్రొఫెసర్లా..!
సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రాక్టీస్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి ఇటీవల వచ్చిన నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ శివదాసన్ ప్రత్యేక ప్రస్తావనలో ఈ అంశాన్ని లేవనెత్తారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో నియామకం కోసం నెట్, హీహెచ్డీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇతర విద్యార్హతలు కూడా అవసరం లేదని యూజీసీ పేర్కొన్నదనీ, ఈ చర్య విశ్వవిద్యాలయాల విద్యా సమగ్రతకు హానికరమని పేర్కొన్నారు. ఇది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువ పరిశోధకుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందనీ, నిర్ణీత అర్హతలు లేని వ్యక్తులు ఈ స్థానాలను ఆక్రమిం చవచ్చు కాబట్టి వారి అవకాశాలు తగ్గుతాయని పేర్కొన్నారు. మన ఉన్నత విద్యా సంస్థల అకడమిక్ సమగ్రతను కాపాడేందుకు ప్రభుత్వం తమ వంతుగా చర్యలు తీసుకోవాలని ఎంపీ శివదాసన్ పేర్కొన్నారు.