Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు ఇచ్చిన వాగ్దానాలపై కేంద్రం వెనక్కి
- లఖింపూర్ ఖేరీ ఘటనలో న్యాయం జరిగేలా చూడాలి :రాష్ట్రపతికి ఎస్కేఎం లేఖ
- దేశవ్యాప్తంగా నిరసన దినం
- నిరసన కార్యక్రమంలో బి.వెంకట్, సారంపల్లి మల్లారెడ్డి,
అరిబండి ప్రసాద్, అబ్బాస్, కోట రమేష్ తదితరులు
న్యూఢిల్లీ : హామీలను నెరవేర్చకుంటే రైతులు ఆందోళనకు దిగడం తప్ప మరో మార్గం లేదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) విమర్శించింది. రైతులకు ఇచ్చిన వాగ్దానాలపై మోడీ సర్కార్ వెనక్కి తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం ఎస్కేఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన దినం జరిగింది. పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. ఎస్కేఎం నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. అలాగే అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. ''ఈ లేఖ ద్వారా దేశవ్యాప్తంగా రైతుల ఆగ్రహాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ప్రభుత్వ ఇచ్చిన హామీలపై ఆధారంగా ఢిల్లీ సరిహద్దుల్లో తమ ఆందోళన వేదికలను ఎత్తివేస్తామని ''సంయుక్త కిసాన్ మోర్చా'' ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం తన వాగ్దానాలపై వెనక్కి తగ్గడమే కాకుండా రైతుల గాయాలపై ఉప్పు చల్లుతోంది. అందుకే దేశంలోని రైతులు 2022 జనవరి 31న ''ద్రోహ దినం'' పాటించారు. దేశంలోని ప్రతి జిల్లా నుండి మీ పేరుతో మెమోరాండం పంపారు. మెమోరాండం తర్వాత పరిస్థితి పెద్దగా మారనందుకు మేం చాలా చింతిస్తున్నాం. కానీ వాస్తవానికి అది మరింత దిగజారింది'' అని లేఖలో పేర్కొన్నారు.
''కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజరు అగర్వాల్ 2021 డిసెంబర్ 9న సంయుక్త కిసాన్ మోర్చాకు పంపిన ఒక లేఖలో ఎంఎస్పీ ఎలా నిర్ధారించాలనే దానిపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని రైతులు తమ పంటలకు ఎంఎస్పీని గుర్తిస్తారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటును ప్రకటించలేదు. కమిటీ స్వరూపం, ఆదేశం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు'' అని స్పష్టం చేశారు. ''ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు హర్యానా ప్రభుత్వం మాత్రమే కొన్ని పత్రాలను పూర్తి చేసి కేసును ఉపసంహరించుకోవాలని కొన్ని ఆదేశాలు జారీ చేసింది. కానీ హర్యానాలో కూడా ఈ పని అసంపూర్తిగా ఉంది. రైతులకు ఇప్పటికీ సమన్లు అందుతున్నాయి. 54 కేసుల్లో 17 కేసులను ఉపసంహరించుకుంటామని ఢిల్లీ పోలీసులు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఏవి ఉపసంహరించుకుంటాయనే దానిపై సమాచారం లేదు. మిగిలిన కేసులను ఎందుకు ఉపసంహరించుకోలేదో వివరణ లేదు. దేశవ్యాప్తంగా రైల్ రోకో సందర్భంగా రైతులపై రైల్వే శాఖ పెట్టిన కేసులను ఉపసంహరించుకోలేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన సందర్భంగా నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞప్తి, సూచన లేదు. ఉద్యమంలో అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు'' అని వివరించారు.
''ఈలోగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతుల గాయాలపై ఉప్పు చల్లే పని చేసింది. లఖింపూర్ ఖేరీ హత్య కేసులో సిట్ నివేదికలో కుట్ర ఉందని అంగీకరించినప్పటికీ, ఈ కేసుకు ప్రధాన సూత్రధారి అయిన అజరు మిశ్రా టెని రాజ్యాంగ, రాజకీయ నైతికతకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇంతలో పోలీసులు, పరిపాలన, ప్రాసిక్యూటర్ సహకారంతో ఈ హత్య ప్రధాన నేరస్థుడు ఆశిష్ మిశ్రా మోనుకు హైకోర్టు నుంచి బెయిల్ లభించింది. ఆ తర్వాత హత్య కేసులో కీలక సాక్షిపై దాడి జరిగింది. అయినప్పటికీ, బెయిల్ ఆర్డర్‌పై అప్పీల్ చేయకపోవడం, సాక్షులకు తగిన రక్షణ కల్పించకపోవడం ప్రభుత్వ నిర్ణయం దాని ఉద్దేశాలను స్పష్టం చేస్తుంది. మరోవైపు ఈ ఘటనలో పేరున్న రైతులను కేసుల్లో ఇరికించి ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ రైతులకు బెయిల్ రాలేదు'' అని తెలిపారు.
''తమ ఆందోళన వేదికలను ఎత్తివేసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం తన రైతు వ్యతిరేక ఎజెండాతో ముందుకు సాగుతోందని మేం ఇంతకుముందు ఇచ్చిన మెమోరాండంలో కూడా హెచ్చరించాం. ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పాడి రైతు ఉనికికే ముప్పు తెస్తోంది. జీవవైవిధ్య చట్టం-2002కి చేసిన సవరణలు రైతు జీవ సంపదకు ముప్పు కలిగిస్తున్నాయి. ఎఫ్‌సీఐ కొత్త నాణ్యతా ప్రమాణాలతో పంట కొనుగోళ్లను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు నిబంధనలను మార్చి పంజాబ్, హర్యానా ప్రభుత్వం నామినేట్ చేసిన ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక మేరకు సభ్యులుగా మార్చడం రైతులపైనా, దేశంలోని సమాఖ్య వ్యవస్థపైనా మరో దాడి'' అని పేర్కొన్నారు.
''ఈ లేఖ ద్వారా దేశంలోని అన్నదాతలు తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. మరోసారి, కేంద్రప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేసి వాటిని వీలైనంత త్వరగా నెరవేర్చి లఖింపూర్ ఖేరీ ఘటనలో న్యాయం జరిగేలా చూడాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. రైతుల సహనాన్ని పరీక్షించడం మానుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సంయుక్త కిసాన్ మోర్చా ఏప్రిల్ 11 నుండి 17 వరకు ఎంఎస్పీ లీగల్ గ్యారెంటీ వీక్‌ను పాటించాలని నిర్ణయించింది. అప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే రైతులు ఆందోళనకు దిగడం తప్ప మరో మార్గం లేదు'' అని పేర్కొన్నారు.