Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2017-18 నుంచి రూ.1.6 లక్షల కోట్లు రాయితీలు
- నిరుదోగ్యం, పేదరికం, అసమానతలు వంటి కీలకమైన అంశాలు విస్మరణ
- మోడీ వల్ల బీజేపీ ఎంపీలే సంతోషంగా ఉన్నారు...
- దేశ ప్రజలు కాదు: రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
న్యూఢిల్లీ: దేశంలోని కార్పొరేట్లకు రాయితీలు, సామాన్యులపై భారాలు వేయడంలోని భాగంగానే బడ్జెట్ ఉందని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ అన్నారు. సోమవారం రాజ్యసభలో ఆయన ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ మోడీ సర్కార్ పనితీరుపై నిప్పులు చెరిగారు. ''ఆర్థిక మంత్రి అంతా బాగుందనే చెబుతున్నారు. ఏ సంక్షోభం లేదు. ఏ సమస్య లేదని అంటున్నారు. దేశంలోని పెరుగుతున్న నిరుదోగ్యం, పేదరికం, అసమానతలు వంటి కీలకమైన అంశాలు మరిచిపోయారు'' అని విమర్శించారు. అడ్వాన్స్
బడ్జెట్ అంచనాలు వాస్తవ వృద్ధి రేటు అనుకూలంగా లేవని, మొత్తం డేటా సంఘటిత రంగంపైనే ఉందని తెలిపారు. అసంఘటిత రంగాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కానీ దేశంలో మెజార్టీ ప్రజలు అసంఘటిత రంగంపైనే ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు.
మంత్రాలు కాదు...పరిష్కారాలు కావాలి
2017-18లో కార్పొరేట్ల ఆదాయం నుంచే వచ్చే ఆదాయ పన్ను జీడీపీలో 3.3 శాతమని, ప్రస్తుతం (2021-22) అది 2.5 శాతానికి తగ్గిందని తెలిపారు. 2017-18 నుంచి ప్రతి ఏడాది కార్పొరేట్లకు 1.6 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారని, ఆశ్రిత పెట్టుబడిదారులను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. 2018-19లో జీఎస్టీ ఆదాయం జీడీపీలో 3.1 శాతమని, అది 2.8 శాతానికి తగ్గిందని తెలిపారు. అందువల్ల సామాన్యుడు పేదవాడిగాను, కార్పొరేట్లు ధనవంతులుగా మారుతున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ధనవంతులకు రాయితీలు, సామాన్యులపై భారాలు మోపుతుందని విమర్శించారు. దీనివల్ల పేదవాడు మరింత పేదవాడిగానూ, ధనవంతుడు మరింత ధనవంతుడిగానూ మారుతున్నారని అన్నారు. ఇదే ప్రభుత్వ పనితీరుకు ట్యాగ్‌లైన్ అని వివరించారు. జీడీపీలో పన్నులు 12 శాతమని, అదే యూకేలో 25 శాతం, ఫ్రాన్స్‌లో 24 శాతం, ఫిన్లాండ్లో 21 శాతం, బ్రెజిల్లో 14 శాతమని తెలిపారు. అధికార పార్టీ ఎంపీలు అన్నింటికీ మోడీ మంత్రం అని జపిస్తున్నారని, అన్ని సమస్యలకు మోడీయే పరిష్కారమని చెబుతున్నారని చెప్పారు. దీనిపై బీజేపీ ఎంపీలు కేకలు వేస్తుండగా.., ఎంపీ బ్రిట్టాస్ దీటుగా సమాధానం ఇచ్చారు. కావాలంటే హంగర్ ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్ వంటి అనేక ప్రపంచ ఇండెక్స్‌లను చూడాలని హితవు పలికారు. ఒక బీజేపీ ఎంపీ తాము ప్రధానితో తాము సంతోషంగా ఉన్నామని అనే సరికి, అవును ప్రధాని మోడీ వల్ల బీజేపీ ఎంపీలు మాత్రమే సంతోషంగా ఉన్నారని, దేశం మాత్రం సంతోషంగా లేదని ఎద్దేవా చేశారు. సమస్యను పరిష్కరించడం తమకు కావాలని, మంత్రాలు తమకు అవసరం లేదన్నారు.
ప్రభుత్వ సంస్థలు అమ్మకం
నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) పేరుతో ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని విమర్శించారు. ప్రతిదానికీ పైప్‌లైన్ పేరు ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు. ''64 ఏండ్ల కిందట కేవలం రూ.5 కోట్లతో ఎల్ఐసీని ప్రభుత్వం స్థాపించింది. ప్రస్తుతం ఎల్ఐసీ ఆస్తుల విలువ రూ.38 లక్షల కోట్లు. పాలసీ దారులే దాన్ని ఇంతటి పెద్ద సంస్థగా నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్‌గా ఎల్ఐసీ నుంచి ఆదాయం పొందుతుంది. దాన్ని అమ్మేసేందుకు సిద్ధపడ్డారు'' అని విమర్శించారు. ''కేంద్ర పన్నుల్లో తమ వాటా తగ్గుతుంది.
పదో ఆర్థిక సంఘం సమయంలో కేరళకు 3.9 శాతం కేంద్రం వాటా వచ్చేది. ఇప్పుడు 1.9 శాతానికి తమ వాటా తగ్గింది. ఇదేనా ఫెడరలిజం?'' అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 2020-21లో పెట్రోలియం ఉత్పత్తులపై రూ.3.7 లక్షల కోట్లు పన్నులు వసూలు చేశారని, అందులో కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే రాష్ట్రాలకు పంపిణీ చేశారని స్పష్టం చేశారు. ''ప్రస్తుతం జేఎన్‌యూపై రాజద్రోహం సంస్థగా ముద్ర వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్కడి నుంచే వచ్చారు. నేను కూడా అక్కడి నుంచే వచ్చాను. అక్కడి నుంచే మేథావులు వచ్చారు. వస్తున్నారు'' అని అన్నారు.