Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కశ్మీర్‌ఫైల్స్ చిత్రబృందంపై రాజకీయపార్టీల విమర్శలు
- హింసలో అందరూ బాధితులే : తరిగామి
- సినిమాలో అన్ని అవాస్తవాలే : ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్ : ప్రజల మధ్య విబేధాలు, దూరాలు పెంచేవిధంగా ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ఉందని జమ్ముకశ్మీర్‌లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి వివాదాస్పదంగా మారిందని, సినిమా హాళ్లలో మత ఘర్షణలు జరుగుతున్నాయని, ముస్లిం మతస్థులపై ప్రధానంగా కశ్మీర్‌కు చెందిన వారిపై దాడులు జరుగుతున్నాయని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక మతం యొక్క విషాదాన్ని 'ఆయుధం'గా మలచి ముస్లిం జనాభాకు వ్యతిరేకంగా ఈ సినిమాను రూపొందించారని ఆరోపించారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అన్ని 'అవాస్తవాలే' చూపించారని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ఈ సినిమా డాక్యుమెంటరీనా, లేక కమర్షియల్ సినిమా అనేది అర్ధం కావడం లేదని అన్నారు. 'ఇది డాక్యుమెంటరీ అయితే చూపించినది సరైనదని చెప్పవచ్చు. కానీ ఇది వాస్తవాలు ఆధారంగా తీసిన సినిమా అని చిత్ర బృందం చెబుతోంది కాబటి ఇది డాక్యుమెంటరీ కాదు' అని కుల్గాంలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఒమర్ అబ్దుల్లా తెలిపారు. 'నిజమేమిటంటే, కశ్మీరీ పండిట్లు లోయను విడిచిపెట్టినప్పుడు, ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి కాదు. జమ్ముకశ్మీర్ గవర్నర్ పాలనలో ఉంది. జగ్మోహన్ గవర్నర్‌గా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ మద్దతుతో విపి సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ ఉంది. సినిమాలో దానిని ఎందుకు చూపించలేదు? కానీ ఫరూక్ అబ్దుల్లాను చూపించారు' ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. కశ్మీర్లో త్యాగాలు కేవలం ఒక నిర్దిష్ట సమాజం మాత్రమే చేయలేదని, ఇతరులు కూడా దాడులను ఎదుర్కొన్నారని ఒమర్ అబ్దుల్లా చిత్ర బృందంపై విరుచుకుపడ్డారు. 'కశ్మీరీ పండిట్ల మరణాలకు మేము చింతిస్తున్నాము, ఇది జరగకూడదు, కానీ కశ్మీరీ ముస్లింలు, కాశ్మీరీ సిక్కులు కూడా చనిపోయారు' అని చెప్పారు. కశ్మీరీ పండిట్ల పునరాగమనానికి అనుకూలమైన పరిస్థితిని కల్పించాలని ఆయన చెప్పారు. అయితే చిత్రనిర్మాతలు మాత్రం వారు తిరిగి రావాలని కోరుకోవడం లేదు, కశ్మీరీ పండిట్లు ఎప్పుడూ బయటే ఉండాలని వారు కోరుకుంటున్నారని ఒమర్ అబ్దుల్లా ఘాటుగా విమర్శించారు. 1990 ప్రారంభం కశ్మీర్ చరిత్రలో చీకటి అధ్యాయంగా సీపీఐ(ఎం) నేత ఎంవై తరిగామి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని మతాలకు చెందిన వారు హింసను ఎదుర్కొన్నారని చెప్పారు. 'గత అనేక దశాబ్దాలుగా కశ్మీర్ నిరంతరం విషాదకర పరిస్థితులను ఎదుర్కొవడం దురదృష్టకరం. కశ్మీరీ పండిట్లు వలస వెళ్లిపోవడం నిజంగా జమ్ముకశ్మీర్ చరిత్రలో ఒక చీకటి దశ. కానీ ఇక్కడ దౌర్జన్యాలకు పాల్పడిన వారు ఏ కులాన్ని, రంగును లేదా మతం అని చూడకుండా అందరిన్నీ బాధపెట్టారనేది కూడా నిజం. హింసలో ఒకవైపు, టికా లాల్, లస్సా కౌల్ అనే వ్యక్తులు చంపబడ్డారు, అదే సమయంలో మహ్మద్ షాబాన్ వకీల్ చంపబడ్డాడు. చివరికి మంచాన పడిన వృద్ధ నాయకుడు మౌలానా మసూదీని కూడా వారు విడిచిపెట్టలేదు' అని తరిగామి గుర్తు చేశారు. 'ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రచారం చేస్తున్న తీరు కశ్మీరీ పండిట్ల బాధను ఆయుధాలుగా చేసుకునే వారి దురుద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పాత గాయాలను మాన్పడానికి, రెండు మతాలకు మధ్య అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి బదులుగా.. వారు ఉద్దేశపూర్వకంగా వాటిని విభజిస్తున్నారు' అని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నాయకురాలు మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు.