Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దశాబ్దకాలంగా తగ్గుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వ వ్యయం
- పంట మద్దతు, రుణ సహకారం నుంచి తప్పుకుంది : తాజా అధ్యయనంలో వెల్లడి
- నగదు బదిలీ..ఒక తప్పించుకునే మార్గం : వ్యవసాయ నిపుణులు
న్యూఢిల్లీ : దశాబ్దకాలంగా వ్యవసాయంరంగంపై కేంద్ర ప్రభుత్వ వ్యయం తగ్గుతూ వస్తోందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. దేశంలో వ్యవసాయ దిగుబడి గణనీయంగా పెరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలేనని అధ్యయనం పేర్కొన్నది. పంట మద్దతు, రుణ సహకారం, మద్దతు ధర..పథకాలు పక్కకు పోయాయని, నగదు బదిలీ పథకాలు తెరపైకి తెచ్చి తప్పించుకుంటున్నారని వ్యవసాయ నిపుణులు విమర్శించారు. వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ వ్యయంపై బెంగుళూరుకు చెందిన 'ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్' (ఎఫ్ఏఎస్) కీలక అంశాలు వెలువరించింది. ఎఫ్ఏఎస్ అధ్యయన నివేదికపై జరిగిన చర్చలో వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యయం తగ్గినందువల్లే చిన్న, సన్నకారు రైతులు రుణాల ఊబిలో చిక్కుకుంటున్నారని, రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆల్ ఇండియా కిసాన్ సభ సంయుక్త కార్యదర్శి విజ్జూ కృష్ణన్ అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలుజేస్తామని ఎన్డీయే నేతృత్వంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అయితే రైతులకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవటంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 2011-12 నుంచి 2018-19 బడ్జెట్ గణాంకాల్ని పరిశీలించగా, వ్యవసాయరంగంపై కేంద్రం ప్రభుత్వ వ్యయం తగ్గుతూ వస్తోంది. జీడీపీలో వ్యవసాయ వాటాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండటం లేదు. పంటల సాగు, ఆహార ఉత్పత్తిలకు గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు, సహకారం లభించేది. కానీ గత దశాబ్దకాలంగా రుణాల పంపిణీ, వడ్డీ మాఫీ, ఇతర సబ్సిడీలు..వీటికి కేంద్రం నుంచి కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. అలాగే మొత్తం ప్రభుత్వ వ్యయంలో నీటి పారుదలకు కేటాయింపులు తగ్గుతున్నాయి. రుణ సహకారం, మద్దతు ధర కల్పించటం..పూర్తిగా దెబ్బతిన్నది.
చరిత్ర ఏం చెబుతోంది..
వ్యవసాయ అభివృద్ధి ప్రభుత్వ పెట్టుబడులతో ముడిపడిన అంశమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇది దేశ చరిత్ర చెబుతున్న నిజమని వారు గుర్తుచేశారు. సాంకేతిక సహకారం, మద్దతు ధర, పంట రుణాలు, మార్కెటింగ్లలో రాష్ట్ర ప్రభుత్వాల కృషి వల్లే..నేడు వ్యవసాయ విప్లవం, పంట దిగుబడులు భారీగా పెరగడానికి దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. అయితే దేశంలో 1990లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర గణనీయంగా తగ్గిందని చెప్పారు.
విద్యా, వైద్యంలోనూ అంతే
చేయాల్సింది చేయకుండా, నగదు బదిలీ పథకాలతో కేంద్ర ప్రభుత్వం ఒక తప్పించుకునే మార్గాన్ని వెతుక్కుంది. దేశ జీడీపీలో వ్యవసాయరంగానికి తగిన విధంగా కేటాయింపులు జరగటం లేదు. అమెరికా జీడీపీలో 33శాతం, ఇటలీలో 43శాతం వ్యవసాయంపై ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారు. భారత్లో మాత్రం కేవలం 15శాతానికి పరిమితమైంది. విద్యా, వైద్య రంగాల్లోనూ ఇదే కొనసాగుతోంది. దేశ జీడీపీలో 1.5శాతం ప్రజా వైద్యానికి మన పాలకులు కేటాయిస్తున్నారు. మిగతా దేశాల్ని చూస్తే అక్కడ విద్యపై 10శాతం ఖర్చు చేస్తున్నారు.
- ప్రొఫెసర్ ఆర్.రామకుమార్,
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్సైన్స్