Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పెట్రో మంట సెగ పార్లమెంట్‌కు తగిలింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై ఉభయ సభలు దద్దరిల్లాయి. రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళనతో సభ పలుమార్లు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ధరల
పెంపుపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులు ఉభయసభల్లో తిరస్కరించారు. తొలుత రాజ్యసభ ప్రారంభం కాగానే 267 రూల్ కింద పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై చర్చించాలని సీపీఐ(ఎం) ఎంపీలు ఎలమారం కరీం, వి.శివదాసన్, జాన్ బ్రిట్టాస్, కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హా గోహిల్, గ్యాస్ ధరలు, కిరోసిన్ ఆయిల్ ధరలు పెరుగుదలపై చర్చించాలని టీఎంసీ ఎంపీ డోలాసేన్ వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. అయితే చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు నోటీసులను తిరస్కరించారు. దీంతో ఆయా పార్టీల ఎంపీలు లేచి నోటీసులను అనుమతించాలని కోరారు. ఎంతకీ అనుమతించకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డుల చేబూని పెద్దఎత్తున నినాదాలు చేశారు. సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్తూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డు ప్రదర్శించిన వారి పేర్లను బులిటెన్‌లో విడుదల చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ జీరో అవర్ నిర్వహించేందుకు చైర్మెన్ ప్రయత్నించారు. అయితే సభ్యుల నినాదాలు హోరెత్తడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మద్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
తిరిగి సభ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. సభను డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తిరిగి ప్రారంభించారు.ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుపై చర్చ జరపాలని ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. ధరల పెరుగుదలపై చర్చ జరపాల్సిందేనని పట్టుపట్టారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను మరో గంటపాటు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే మధ్యాహ్నాం రెండు గంటలకు వాయిదా పడింది.
తిరిగి ప్రారంభమైన సభను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జమ్మూ కాశ్మీర్ ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకొని ''పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుదలపై చర్చించాలని ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. సభ ప్రారంభమై ఐదు నిమిషాలు అవుతుంది. కానీ కేంద్ర మంత్రులు లేరు. సభాపక్షనేత లేరు. ఇంకేం చేస్తాం'' అని ప్రశ్నించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్షాల వాకౌట్
మరోవైపు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపుపై లేవనెత్తారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సీపీఐ(ఎం), టీఆర్ఎస్ తదితర పార్టీల నేతల తమ స్థానాల్లో లేచి చర్చకు పట్టుపట్టారు. అయితే ప్రతిపక్షాల అభ్యర్థనను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలు నిర్వహించిన తరువాత వాటిపై చూద్దామని స్పీకర్ పేర్కొనడంతో ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లో కూర్చోన్నారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలపై చర్చ జరపాలని వాయిదా తీర్మాన నోటీసులను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. సీపీఐ(ఎం) ఎంపీ ఎ.ఎం ఆరీఫ్, కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీలు కె.సురేష్, మనీష్ తివారీ, టిఎన్ ప్రతాపన్, గౌరవ్ గొగొరు, మానికం ఠాగూర్, ఎన్‌సి ఎంపీ అబ్దుల్ మసూద్ తదితరులు ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసులను అనుమతించలేదు. అయితే వెంటనే అధిర్ రంజన్ చౌదరి మట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగాయనీ, ఐదు రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన వెంటన ధరలు పెంచారని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే.. వంటగ్యాస్ రూ.50, పెట్రోల్, డీజిల్ లీటర్‌కు 80 పైసల్ పెంచటమేంటని ప్రశ్నించారు. డీఎంకే నేత టిఆర్ బాలు మాట్లాడుతూ పెట్రో ఉత్పత్తులు పెంచడం దారుణమని అన్నారు. టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదల తీవ్రస్థాయిలో ఉన్నాయని, ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ వెంటనే ప్రతిపక్షాలు సభను వాకౌట్ చేశాయి.