Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీర్భం జిల్లాలో అర్ధరాత్రి వేళ దుండగుల స్వైర విహారం
- ఇళ్ళల్లో బంధించి నిప్పంటించిన గూండాలు
- 8మంది సజీవ దహనం
- ఖండించిన ప్రతిపక్షాలు
- మమత రాజీనామాకై డిమాండ్
- రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న గవర్నర్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో బీర్బం జిల్లాలోని భక్తు గ్రామంలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. అత్యంత అమానవీయంగా జరిగిన హింసాకాండలో 8మంది సజీవ దహనమయ్యారు. ఇండ్లల్లో బంధించి మరీ ఇండ్లకు నిప్పంటించారు. తృణమూల్ కాంగ్రెస్ డిప్యుటీ ప్రధాన్ హత్య జరిగిన అనంతరం చెలరేగిన ఈ హింసాకాండలో అనేక ఇండ్లు దగ్ధమయ్యాయనీ, ఒకే ఇంట్లో ఏడుకాలిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి కాలిన గాయాలతో బీర్భం ఆస్పత్రిలో మరణించాడని చెప్పారు. తృణమూల్ నేత హత్యకు, ఈ హింసకు మధ్య గల సంబంధంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారని డీజీపీ మనోజ్ మాలవీయ తెలిపారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. అందులో ఏడీజీ సీఐడీ జ్ఞాన్‌వంత్ సింగ్, బర్ద్వాన్ జోన్ ఐజీ బి.ఎల్.మీనా, డీఐజీ సీఐడీ (ఆపరేషన్స్) మీరజ్ ఖలీద్‌లు ఈ బృందంలో సభ్యులుగా వున్నారు. ''ఇది రాజకీయ శతృత్వం కాదు, రెండు గ్రూపుల మధ్య పాతుకుపోయిన వ్యక్తిగత కక్షలై వుండవచ్చని'' డీజీపీ వ్యాఖ్యానించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి 11మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం తృణమూల్ నేత భాదు షేక్‌పై కొంతమంది దుండగులు బాంబులు విసిరారు. తీవ్రమైన గాయాలతో అతను చనిపోయాడని, ఆ తర్వాత కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 10 నుంచి 12ఇండ్లకు నిప్పంటించారని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనలో ప్రతీకారం తీర్చుకోవడమనేది తక్షణమే కనిపించిదని సీనియర్ పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. సంజూషేక్ అనే వ్యక్తి ఇంటి నుంచి ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా దాదాపు 10 ఇండ్లు మాడి మసయ్యాయని గ్రామస్తులు చెప్పారు. ''డిప్యూటీ ప్రధాన్ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనకు, ఇండ్లకు నిప్పంటించిన ఘటనకు సంబంధం ఏమైనా వుందా అనేది కనుగొనాల్సివుంది.'' అని మంత్రి, సీనియర్ తృణమూల్ నేత ఫర్హాద్ హకీమ్ పేర్కొన్నారు. రాంపుర్హట్ సబ్ డివిజన్లోని భక్తు గ్రామానికి వెళుతూ ఆయన మాట్లాడారు. కాగా, బీర్భం జిల్లా తృణమూల్ అధ్యక్షుడు అనువ్రత మోండాల్ మాట్లాడుతూ, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి వుండవచ్చని వ్యాఖ్యానించారు. మంత్రి ఫర్హాద్ హకీమ్ నేతృత్వంలో ఇద్దరు సభ్యుల తృణమూల్ ప్రతినిధి బృందం రాంపుర్హట్కు బయలుదేరి వెళ్ళిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
వాస్తవాలను తొక్కిపట్టేందుకే సిట్ : సీపీఐ(ఎం)
కాగా ఈ సంఘటన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రతిపక్షం తీవ్రంగా ధ్వజమెత్తింది. హోం శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కాగా ఈ హింసకు నిరసనగా 22మంది బీజేపీ ఎంఎల్ఎలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ, రాష్ట్రపతి పాలన దిశగా పశ్చిమ బెంగాల్ పయనిస్తోందని వ్యాఖ్యానించారు. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లామని రేపు ఈ కేసును విచారించనున్నారని తెలిపారు. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ, తణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇది ఊచకోతేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం వ్యాఖ్యా నించారు. మొత్తంగా ఈ దారుణ సంఘటనను అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. దర్యాప్తును, వాస్తవాలను తొక్కిపట్టి వుంచేందుకే సిట్‌ను ఏర్పాటు చేశారని అన్నారు.
గవర్నర్ ఖండన
బీర్భం జిల్లాలోని హింసను గవర్నర్ జగ్దీప్ ధన్కర్ తీవ్రంగా ఖండించారు. మానవ హక్కులు కాలరాయబడ్డాయని, చట్టబద్ధ పాలన తొక్కివేయబడిందని విమర్శించారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. ''రాష్ట్రంలో హింసా సంస్కృతి నెలకొందని, చట్టబద్ధత కొరవడిందని'' వ్యాఖ్యానించారు.