Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లిం డ్రైవర్‌పై వీహెచ్‌పీ కార్యకర్తలు దాడి
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో హిందూత్వ శక్తులు పెట్రేగిపోతున్నాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా మాథూరా జిల్లాలో ఒక ముస్లిం డ్రైవర్‌ను గోసంరక్షకులుగా చెప్పుకుంటున్న కొంతమంది విచక్షణారహితంగా కొట్టారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అమీర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడిపై దాడిచేసి..కొడుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ప్రసారమైంది. స్థానికంగా హిందూత్వ గ్రూపులకు చెందిన కొంతమంది వాహనాన్ని ఆపి..గోమాంసం తరలిస్తున్నాడని అమీర్‌పై ఆరోపించారు. బాధితుడు చెప్పే విషయాన్ని వినిపించుకోకుండా, మూకుమ్మడిగా దాడి జరిపారు. తనను కొట్టొద్దు..అని ఎంత వేడుకున్నా వినలేదు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. పోలీసుల ప్రాథమిక విచారణ తర్వాత తేలిందేమంటే, మాథూరా జిల్లాలో నగర పంచాయితీ గోవర్ధన్ నుంచి జంతు కళేబరాలను తరలించే పని అమీర్‌కు అప్పజెప్పారు. ''గోవర్ధన్ గ్రామానికి చెందిన రామేశ్వర్ వాల్మీకీతో మేం మాట్లాడాం. జంతువుల కళేబరాలను తరలించే లైసెన్స్ ఇతడికి ఉంది. మాథూరా నుంచి వాహనాన్ని తెప్చించి వ్యర్ధాలను తరలిస్తున్నాడు. వాహనంలో గోమాంసం లేదని ప్రాథమిక విచారణలో తేలింది'' అని జిల్లా ఎస్పీ ప్రకాశ్‌సింగ్ మీడియాకు తెలిపారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కి చెందిన వికాస్ శర్మ, మరోక వ్యక్తి ఠాకూర్ ఇద్దరూ కలిసి తొలుత వాహనాన్ని అడ్డగించి అమీర్‌పై దాడి చేశారని స్థానిక మీడియా వార్తా కథనాలు రాసింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 16మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిసింది.