Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంటగ్యాస్ రూ.1002
- ఓట్ల అవసరం తీరాక.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
- హైదరాబాద్‌లో రూ.110కి చేరువైన పెట్రోల్
- పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆగ్రహం
- పలుమార్లు వాయిదా
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఇక ప్రజలతో పని అయిపోయిందని కేంద్రంలో మోడీ సర్కార్ భావించింది. ఒకేరోజు ఇటు వంటగ్యాస్ సిలిండర్, అటు పెట్రోల్, డీజిల్ ధరలు పెద్దమొత్తంలో పెంచేసింది. మంగళవారం 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెరిగింది. దాంతో వంటగ్యాస్ ధరలు తెలంగాణలో రూ.1002కు, ఆంధ్రప్రదేశ్‌లో ధర రూ.1008కు చేరుకున్నాయి. ఢిల్లీ, ముంబయిలలో రూ.949.50, కోల్‌కతాలో రూ.976, చెన్నైలో రూ.965.50లు, లక్నోలో రూ.987.50 వసూలు చేయనున్నారు. తెలంగాణలో వంట గ్యాస్ ధర రికార్డ్‌స్థాయిలో వెయ్యి రూపాయలకు చేరుకోవటం ఇదే మొదటిసారి. ఇప్పటికే వంట నూనె ధరలు, ఇతర నిత్యావసర సరుకుల ధరల పోటుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు ఇప్పుడు వంట గ్యాస్, ఇంధన ధరల పెంపు పేదలు, మధ్య తరగతిపై తీవ్ర ప్రభావం చూపనున్నది.
పెట్రో వడ్డన మళ్లీ షురూ
మంగళవారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు ఐదు నెలల తర్వాత చమురు సంస్థలు ధరలను పెంచాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 87పైసలు పెంచారు. దీంతో లీటర్ పెట్రోల్ రూ.109.10, డీజిల్ రూ.95.40పైసలకు చేరుకున్నాయి. విజయవాడలో పెట్రోల్ రూ.110.80, డీజిల్ రూ.96.83, గుంటూరులో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ.97.26గా నమోదయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.82 కాగా, డీజిల్ ధర రూ. 95కు చేరింది. కోల్‌కతా, చెన్నైలలో వరుసగా పెట్రోల్ ధర రూ. 105.51, రూ.102.16 కాగా, డీజిల్ ధరలు వరుసగా రూ. 90.62, రూ.92.19గా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.10, డీజిల్ రూ95.40పైసలకు చేరింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే ఇంధన ధరల్ని మోడీ సర్కార్ భారీగా పెంచింది. వాహనదారుల నుంచి లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదు నెలల కాలంపాటు ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేసే ఉద్దేశం ఉన్నందునే, అంతకుముందే ధరల్ని రికార్డ్‌స్థాయిలో పెంచారని సమాచారం. ఎన్నికల సమయంలో అంతర్జాతీయ ధరలు పెరిగినా..దాని ప్రభావం గుర్తుకురాని మోడీ సర్కార్‌కు, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక..ధరల పెంపునకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఉక్రెయిన్ సంక్షోభం, ముడి చమురు ధరలు భారీగా పెరిగాయని సాకుగా చూపి ధరల వడ్డనకు తెరలేపింది.