Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి : రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ వి శివదాసన్
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్ బడ్జెట్ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ శివదాసన్ పాల్గొన్నారు. ఐక్యత కోసం, సమగ్రత కోసం జమ్మూ కశ్మీర్ ప్రజలు చేసిన పోరాటం ఘన చరిత్ర కలిగిందని అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలు సావర్కర్, మహ్మద్ ఆలీ జిన్నాల రెండు దేశాల సిద్ధాంతాన్ని తిరస్కరించారని పేర్కొన్నారు. అలాగే మత రాజ్య సిద్ధాంతాన్ని తిరస్కరించి, లౌకికరాజ్యాన్ని స్థాపించారని తెలిపారు. దేశ స్వాతంత్య్ర సమయంలో పాకిస్తాన్ నుంచి దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్ ప్రజలు నిలబడ్డారని గుర్తు చేశారు. లౌకిక భారత దేశంలోనే తమ సంస్కృతి, జీవనోపాధి, నమ్మకాలకు భద్రత ఉంటుందని జమ్మూకశ్మీర్ ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ఈ నమ్మకాలే దేశ సమగ్రతకు కీలకమని చెప్పారు. కానీ ప్రస్తుతం చాలా బాధాకరమైన పరిస్థితి నెలకొందని అన్నారు. గతంలో జమ్మూకశ్మీర్ ప్రతినిధులు అసెంబ్లీలోనూ, ఇదే సభలోనూ తమ బడ్జెట్ కేటాయింపులపై చర్చలో పాల్గొనే వారని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హోదా రద్దు చేసిందనీ, దేశ ప్రజలకు ఆవేదనకరమైన అనుభవం వచ్చిందని అన్నారు. ఎక్కడైనా కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హౌదా ఇస్తారని, కానీ జమ్మూకశ్మీర్ విషయంలో రాష్ట్ర హోదా నుంచి కేంద్ర పాలిత ప్రాంతం చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో కశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోయిందనీ, కేంద్ర ప్రభుత్వం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిందని ఆరోపించారు. కశ్మీర్లో ఇంటర్నెట్ నిలిపివేశారని గుర్తు చేశారు. ప్రపంచంలో ప్రజల ప్రాథమిక హక్కుగా ఇంటర్నెట్ ఉందని, కేరళ ప్రభుత్వం ఇంటర్నెట్ను సార్వత్రిక హక్కుగా ప్రకటించిందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో అధిక సంఖ్యలో సామాన్యులను దిగ్బంధించి, జైళ్లకు తరలించారని ఆరోపించారు. అమాయక ప్రజలను అరెస్టు చేశారని, ప్రజా ప్రతినిధులను దిగ్బంధించారని విమర్శించారు. వాణిజ్యం, వ్యాపారం ఆగిపోవడంతో కశ్మీర్ రూ.40 వేల కోట్లు నష్టపోయిందని, టూరిజం చాలా సమస్యలను ఎదుర్కొంటుందని తెలిపారు. ఈ కాలంలో ప్రజల మనోభావాలను పరిగణనలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదని విమర్శించారు. అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వరంగంలో ఉద్యోగాలను తగ్గించిందని అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారనీ, ఈ సమయంలో ఆ ప్రజలకు సహాయం చేయాలని డిమాండ్ చేశారు. భద్రత, జీవనోపాధి కల్పించాలని కోరారు. జమ్మూకశ్మీర్ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగమని, కేంద్ర ప్రభుత్వ లేబర్ సర్వే రిపోర్టు ప్రకారం అక్కడ పట్టణ ప్రాంతాల్లో 15-20 మధ్య వయస్సు గల యువతలో 46.3 శాతం నిరుద్యోగ రేటు ఉందని, అదే గతంలో 44.1 శాతం ఉందని తెలిపారు. అక్కడ 66.16 శాతం అక్షరాస్యత ఉందని, అది జాతీయ సగటు 75.98 శాతం కంటే తక్కువని తెలిపారు. తలసరి ఆదాయం 22 శాతమని, ఇది కూడా జాతీయ సగటు కంటే తక్కువ ఉందని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో మరణాల రేటు 34 ఉందని, అదే కేరళలో కేవలం 12 మాత్రమేనని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో 50 శాతం కంటే ఎక్కువ గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. విద్యుత్ సరఫరా, విద్యా సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్ ప్రజల సమాఖ్య హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస ఎంపి ఫౌజియా ఖాన్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ యువతకు 75 వేల ఉద్యోగాలు ఇస్తామని 2020 నవంబర్ 27న విడుదల చేసిన డీడీసీ ఎన్నికల మానిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చిందనీ, 2021 జూన్ 3న బీజేపీ ఎంపీ సయ్యద్ జఫర్ 25 వేల ఉద్యోగాలు 2021 ముగియకముందే ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 2022 ఫిబ్రవరిలో నిరుద్యోగ రేటు 15 శాతం ఉందని, జాతీయ సగటు 6.7 శాతం కంటే చాలా ఎక్కువని అన్నారు.