Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కర్నాటకలో మతతత్వ శక్తులు మరో వివాదానికి తెరలేపాయి. రాష్ట్రంలోని స్థానిక వార్షిక ఉత్సవాల సమయంలో ముస్లింలు దుకాణాలను ఏర్పాటు చేయకుండా ఆలయ అధికారులు నిషేధం విధించారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఈ నెల 15న కర్ణాటక హైకోర్టు సమర్థించిన సంగతి విదితమే. కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన ముస్లిం వ్యాపారవేత్తలు... తమ దుకాణాలకు తాళాలు వేశారు. ఇప్పుడు వారిపై కక్ష సాధింపు చర్యలుగా... ఏకంగా ఉత్సవాల్లో దుకాణాల ఏర్పాటుపై నిషేధం విధించారు. ఈ ఉత్సవాల సమయంలోనే కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుండగా... ముస్లిం వ్యాపారులపై వేటు వేయడంతో.. వారికి తీవ్ర నష్టం చేకూరనుంది. ఈ నెల 31న మహాలింగేశ్వర ఆలయంలో జరిగే ఉత్సవాలకు నిర్వహించే వేలంలో పాల్గనేందుకు కేవలం హిందువులు మాత్రమే అర్హులని ఆహ్వాన పత్రికలో నిర్వాహకులు పేర్కొన్నారు.
ఉడిపి జిల్లాలోని కాప్‌లో... హౌసా మారిగుడి దేవాలయం మేనేజింగ్ కమిటీ సైతం.. ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే జాతరలో భాగంగా... ఈ నెల 18న నిర్వహించే వేలంలో ముస్లింలకు స్టాల్స్‌ను కేటాయించలేదు. సుమారు 100 స్టాళ్లను వేలం వేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వేలంలో కేవలం హిందువులకు మాత్రమే అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ కమిటీ హెడ్ రమేష్ హెగ్డే ఓ సమావేశంలో తీర్మానం చేశారని సమాచారం. ఈ విషయంపై రమేష్ మాట్లాడుతూ... హిజాబ్ వివాదంపై హైకోర్టు ఉత్తర్వులను గౌరవించని ముస్లిం వ్యాపారస్తులకు, స్టాళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వకూడదంటూ హిందూత్వ సంస్థలు కోరినట్టు తెలిపారు.