Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను స్మరించుకున్న ఎంపీలు
న్యూఢిల్లీ : ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన స్వాతంత్రోద్యమ అమరవీరులు షాహిద్ భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు పార్లమెంట్ ఘన నివాళులర్పించింది. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ 91వ వర్థంతి సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల్లో సంతాపం తెలిపారు. 1931 మార్చి 23న దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ ఉరి సంకెళ్లను ముద్దాడి, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ విప్లవవీరుల వర్థంతి సందర్భంగా యావత్ దేశం షాహిద్ దివస్‌ను నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే పార్లమెంట్లో ఘన నివాళులర్పించారు. రాజ్యసభలో చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ''దేశ స్వాతంత్రోద్యమంలో దిగ్గజ వీరులు భగత్ సింగ్, రాజ్గుర్, సుఖ్‌దేవ్ 91వ వర్థంతి. 1931లో ఈ రోజున వారు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. మాతృభూమి కోసం దేశభక్తితో పని చేశారు. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పిన్న వయస్సులోనే ఉద్యమం చేశారు. ఉరితీసేటప్పుడు కూడా తమ ముఖాల్లో చిరునవ్వు ఉంది. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ ప్రాణాలను వదిలారు. అమరవీరులు దేశాన్ని వలసవాద బంధనాల నుంచి విముక్తి చేయడమే కాకుండా మతతత్వం, ద్వేషం, ఆర్థిక అసమానతలు, తిరోగమన ఆలోచనలు లేని న్యాయమైన, ఆదర్శవంతమైన సమాజాన్ని కూడా ఊహించారన్నారు. వీరోచిత పోరాటం, వారి రాజీలేని సంకల్పం, అత్యున్నత త్యాగం అన్ని కాలాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. వారి శౌర్యం, దేశభక్తి అనేకమందిని ప్రేరేపించాయనీ, రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అనంతరం సభ్యులంతా తమ స్థానాల్లో నిలబడి మౌనం పాటించారు. ''అమర్ రహే'' అంటూ ముగించారు.