Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియన్ రైల్వే ప్రతికూల పరిస్థితిపై సీపీఐ(ఎం)ఎంపీ జాన్ బ్రిట్టాస్
న్యూఢిల్లీ : విధాన వైఫల్యం వల్లే ఇండియన్ రైల్వే ప్రతికూల పరిస్థితిల్లోకి నెట్టబడిందని సీపీఐ(ఎం)ఎంపీ జాన్ బ్రిట్టాస్ అన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్‌పై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఇండియన్ రైల్వే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగులున్న సంస్థ అనీ, ఆర్థిక వృద్ధికి కీలకమైన రంగమని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ రైల్వేలో విధాన వైఫల్యం, వనరుల కొరత, నైపుణ్యం లోపించటం వంటి వాటివల్ల ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. 1950లో నేషనల్ గూడ్స్ ట్రాన్స్‌పోర్టులో ఇండియన్ రైల్వే 84శాతమనీ, ప్రస్తుతం అది 28శాతానికి తగ్గిందని తెలిపారు. ప్యాసింజర్ రైల్వే మరింత దయనీయమైన పరిస్థితుల్లో ఉందన్నారు. 1950లో ప్యాసింజర్ రైల్వేలో 79 శాతమనీ, ఇప్పుడు 12శాతానికి పడిపోయిందని వివరించారు. కరోనా సమయం (2021-22)లో ప్యాసింజర్ ఆదాయం 191శాతం పెరిగిందనీ, టిక్కెట్ల ధరలు 200 నుంచి 230 శాతం పెంచారని తెలిపారు. కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన సెమీ, హైస్పీడ్ రైల్వేలో భాగంగానే కేరళలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌తో వచ్చిన కె-రైల్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ, ముస్లీం లీగ్‌లు ఏకమై ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.