Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులో కేంద్రమంత్రి బుకాయింపు
- ప్రయివేటీకరణ నుంచి వెనక్కి తగ్గేదిలేదని వెల్లడి
న్యూఢిల్లీ : పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామచంద్రప్రసాద్ సింగ్ బుకాయింపులకు దిగారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులపై అభాండాలు వేశారు. ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలకు, క్యాప్టివ్మైన్లకు సంబంధం లేదని చెప్పారు. కార్మికులు సామర్ధ్యం మేరకు పనిచేయకపోయినందువల్లే నష్టాలు వచ్చాయని సూత్రీకరించారు. లోక్‌సభలో బుధవారం నాడు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ప్రజలు ప్రతిఘటిస్తున్నా విశాఖ ఉక్కును ఎందుకు ప్రయివేటీకరిస్తున్నారంటూ టీడీపీ,వైసీపీ సభ్యులు నిలదీశారు. దీంతో జోక్యం చేసుకున్న కేంద్రమంత్రి వాస్తవాలతో పొంతన లేని విషయాలను ఏకరువు పెట్టారు. రాష్ట్ర ఎంపీలు నిరసన గళం వినిపిస్తున్నా ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న కార్మికులను లక్ష్యం చేసుకు న్నారు. 'స్టీల్ ప్లాంటు 12 సంవత్సరాలు లాభాల్లో ఉంది. అప్పుడు కూడా క్యాప్టివ్ గనులు లేవు. అయినా లాభాలు వచ్చాయి. ఇప్పుడు ఎందుకు రావడం లేదు? క్యాప్టివ్ గనులకు లాభాలకు సంబంధం లేదని అర్ధం కావడం లేదా?' అని ఆయన ప్రశ్నించారు. కార్మికులు నిర్ధేశించిన లక్ష్యాలను అందుకోలేక పోయారని, సామర్ధ్యం మేరకు పనిచేయలేకపోయారని అందువల్లే నష్టాలు వచ్చాయని చెప్పారు.
విస్తరణ వల్లే అప్పులు
మార్కెట్‌తో సంబంధం లేకుండా ప్లాంటును విస్తరించడం వల్ల అప్పులు పెరిగిపోయాయని కేంద్ర మంత్రి చెప్పారు. మొదట్లో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉండేదనీ, ఆ తరువాత విస్తరించారని చెప్పారు. దీనికోసం భారీగా ఖర్చు చేశారని ఫలితంగా 22 వేల కోట్ల రూపాయల అప్పులు పేరుకుపోయాయని చెప్పారు. విస్తరించిన ఉత్పత్తి సామర్ధ్యాలను కార్మికులు అందుకోలేకపోయారని, ఫలితంగా 7 వేల కోట్లకు పైగా నష్టం వచ్చిందని చెప్పారు. నికర విలువ కూడా భారీగా తగ్గిందని, మూడు వేల కోట్ల రూపాయలకు పడిపోయిందని చెప్పారు. ప్లాంటును పునరుజ్జీవింపచేయాలంటే పెట్టుబడుల ఉపసంహరణే మార్గమని అన్నారు.
పునరాలోచన చేయండి : ఎంపీల విజ్ఞప్తి
ఈ విషయమై చర్చలో పాల్గన్న వైసీపీ, టీడీపీ సభ్యులు ప్రయివేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. తొలుత మాట్లాడిన టిడిపి సభ్యుడు రామ్మోహన్ నాయుడు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు నూరుశాతం వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.