Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో డీవైఎఫ్ఐ భారీ ర్యాలీ
తిరువనంతపురం : తిరువనంతపురం లోని హిందూస్తాన్ లైఫ్‌కేర్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్)ను ప్రయివేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ జరిగింది. పూజప్పురలోని హెచ్ఎల్ఎల్ హెడ్ క్వార్టర్స్ నుంచి పెరూర్కడాలోని ప్రొడక్షన్ యూనిట్ వరకు 12 కిలోమీటర్ల మేర ర్యాలీని చేపట్టారు. ఇందులో 1500 మందికి పైగా యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఎఎ రహీమ్ మాట్లాడుతూ.. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ.. యువతకు తీరని చేటు చేస్తుందని అన్నారు. హెచ్ఎల్ఎల్ వంటి ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ యువత ఉపాధి అవకాశాలకు ఆటంకం కల్గిస్తుందని పేర్కొన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు ప్రభుత్వరంగ ఉద్యోగాలకు హామీనిచ్చే రిజర్వేషన్ వ్యవస్థను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించారు. కేరళ ప్రభుత్వం, కార్మిక సంఘాలు, ప్రజానీకం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. హెచ్ఎల్ఎల్ను ప్రయివేటీకరించేందుకు కేంద్రం సిద్ధమైంది. అందులో భాగంగా చేపడుతున్న బిడ్డింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనేందుకు అనుమతించలేదు. కాగా, ఈ చర్య సహకార సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ.. ప్రధాని మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు.