Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహం
- ఉభయ సభలు వాయిదా
- ప్రజా దోపిడీ ఆపండి..
- ప్రధాని సమాధానం చెప్పాలి : ప్రతిపక్ష ఎంపీలు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంపు పార్లమెంట్‌ను కుదుపేసింది. ఉభయ సభల్లోనూ, పార్లమెంట్ ఆవరణంలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజలపై భారాలు వేస్తున్న మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాల హౌరెత్తించారు. దేశ ప్రజలను దోచుకోవడం ఆపాలనీ, ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఉభయ సభలు కొద్ది సేపు వాయిదా పడ్డాయి. ధరల పెంపును నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాల హౌరెత్తించారు. రాజ్యసభలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్‌తో సహా పప్పులు, వంట నూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలపై చర్చించాలని 267 రూల్ కింద ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీపీఐ ఎంపీ బినరు విశ్వం, కాంగ్రెస్ ఎంపీలు శక్తిసిన్హ్ గోహిల్, సయ్యద్ నసీర్ హుస్సేన్, కెసి వేణుగోపాల్, ఎస్పీ ఎంపీలు రామ్‌గోపాల్ యాదవ్, విషంభర్ ప్రసాద్ నిషాద్ నోటీసులు ఇచ్చారు. అయితే వాటిని చైర్మెన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంపు 267 రూల్ కింద చర్చించాల్సిన అంశం కాదనీ, ఇది సాధారణ అంశమని అన్నారు. డిమాండ్స్ అండ్ గ్రాంట్స్‌పై జరిగిన చర్చ సందర్భంలో చర్చించొచ్చని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇప్పుడే చర్చించాలని పట్టు పట్టాయి. ప్రతిపక్ష నేతలు తమ స్థానాల్లో లేచి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిన వెంటనే, అన్ని నిత్యావసర, వినియోగ ధరలు పెరిగాయని అన్నారు. వెంకయ్యనాయుడు జోక్యం చేసుకొని ఇది సాధారణ అంశమని ఇప్పటికే చెప్పాను.. అన్నారు. ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుదల చాలా ముఖ్యమైన అంశామని, తాను నోటీసు ఇచ్చానని తెలిపారు. జీరో అవర్‌ను సస్పెండ్ చేసి, ప్రజల సమస్య అయిన ధరలు పెరుగుదలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
లోక్‌సభలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్‌తో సహా నిత్యావసర వస్తువుల ధరలు పెంపుపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిలబడి ధరల పెంపుపై చర్చ చేపట్టాలని పట్టుపట్టారు. అయినప్పటికీ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాల హౌరెత్తించారు. స్పీకర్ ఎంతకీ చలించకపోవడంతో కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, డీఎంకే, ఎన్సీపీ, టీఎంసీ తదితర పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ''2014లో వంటగ్యాస్ రూ.410, 2022లో వంటగ్యాస్ రూ.1,000, ప్రజలను లూటీ ఆపండి, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును వెనక్కి తీసుకోండి'' అంటూ ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు హౌరెత్తించారు.
అమర వీరులకు
పార్లమెంట్ ఘన నివాళి
దేశం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన అమర వీరులు షాహిద్ భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను పార్లమెంట్ ఘనంగా నివాళి అర్పించింది.