Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దలందరికీ బూస్టర్‌డోస్ ఇవ్వకపోవడంపై ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్
- భారత ప్రభుత్వం తీరుపై అసంతృప్తి
న్యూఢిల్లీ : దేశంలోని పెద్దలందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో బూస్టర్ డోస్ ఇవ్వకపోవడంపై భారత ప్రభుత్వ తీరును ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ తప్పుబట్టారు. కేంద్రం తీరు 'అశాస్త్రీయం' అని చెప్పారు. యూరప్, తూర్పు ఆసియాల్లో ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు వాటికి కారణమైన ఒమిక్రాన్ బీఏ.2 వంశం భారత దేశంలో విజృంభించే స్థితి గురించి జరిగిన ఇంటర్వ్యూలో ఆయన పై విధంగా స్పందించారు. భారతీయ వ్యవస్థకు సైన్స్ పట్ల శ్రద్ధ లేకపోవడం, తరుచుగా సైన్స్‌ను అనుసరించడానికి ఇష్టపడకపోవడం 'అయోమయానికి గురి చేస్తున్నది' అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా రెండు వాస్తవాలను సూచిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. '' బూస్టర్లు అవసరమని సైన్సు చూపిస్తున్నది. కానీ, వాటిని ఇవ్వడం లేదు. భారతదేశంలో ప్రస్తుతం ఇస్తున్నవాటి కంటే మంచి వ్యాక్సిన్లు ఉన్న విషయాన్ని సైన్స్ తెలిపింది. కానీ, ఇక్కడ ఇలా జరగడం లేదు'' అని ఆయన అన్నారు. కరణ్‌థాపర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో షాహిద్ జమీల్ ఈ వ్యాఖ్యలు చేశారు. లక్ష్యం, ఉద్దేశ్యం ఏమిటో కచ్చితంగా నిర్ణయించకోలేకపోవడం అనేది భారత ప్రభుత్వానికి స్పష్టమైన, శాస్త్రీయ విధానం లేకపోవడానికి ఒక కారణంగా ఆయన వివరించారు. దీర్ఘకాలిక కోవిడ్ ఆరోగ్య వ్యవస్థకు ఒత్తిడిని కలిగిస్తుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో బూస్టర్టు ఇవ్వకపోవడం అశాస్త్రీయమని చెప్పారు. వీటిని భారత్‌లో ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని జమీల్ సూటిగా చెప్పారు. భారత్‌లో టీకాల కొరత లేకపోతే వాటిని తీసుకోవాలనుకునే పెద్దలందరికీ తప్పనిసరిగా బూస్టర్లను అనుమతించాలని తెలిపారు.