Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద అరెస్టు చేసిన జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలీద్‌కు బెయిలిచ్చేందుకు స్థానిక కర్కర్డుమా కోర్టు నిరాకరించింది. ఈ నెల 3న ఇరు వైపులా వాదనలు విన్న అదనపు సెషన్ జడ్జి అమితాబ్ రావత్ తీర్పును రిజర్వు చేశారు. కాగా, వాదనల సమయంలో ఈ కేసులో తాను నేరస్తుడినని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ వద్ద సరైన ఆధారాలు లేవని ఖాలీద్ కోర్టుకు తెలిపారు. గురువారం చేపట్టిన విచారణలో కోర్టు బెయిల్ నిరాకరించింది. 2020 ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలు ఘర్షణలకు దారి తీసిన సంగతి విదితమే. ఈ అల్లర్లలో 53 మంది చనిపోగా... సుమారు 700 మంది గాయపడ్డారు. ఈ అల్లర్ల జరగడానికి ముందు సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న షహీన్‌బాగ్ ప్రాంతంలో ఖాలీద్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ.. ఆయనే ప్రధాన కుట్రదారుడని పేర్కొంటూ సెప్టెంబర్ 14న పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ, ఉపా కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఖాలీద్ తీహార్ జైలులో ఖైదీగా ఉన్నారు. కాగా, ఈ కేసులో 18 మందిని అరెస్టు చేయగా... ఇప్పటి వరకు ఆరుగురికే బెయిల్ లభించింది.