Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీ విద్వేషాన్ని ఆపండి !
- రాజ్యాంగ సంస్థలకు జర్నలిస్టుల వినతి
- 28మంది మీడియా ప్రముఖుల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ : దేశంలో మైనారిటీలపై ముఖ్యంగా ముస్లింలపై తరచుగా దాడులు జరుగుతుండడం పట్ల జర్నలిస్టులు, మీడియా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, తక్షణమే దాడులను ఆపేలా చర్యలు తీసుకోవాలనీ, రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను పరిరక్షించాలని అన్ని రాజ్యాంగ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 28మంది సీనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రముఖులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
''ఇన్ ది ఫేస్ ఆఫ్ ఆర్కెస్ట్రేటెడ్ హేట్రెడ్, సైలెన్స్ ఈజ్ నాట్ యాన్ ఆప్షన్'' అనే శీర్షికతో వారు ఈ విజ్ఞప్తి చేశారు. ఇటీవల సంవత్సరాల్లో దేశంలో విద్వేష భావాలు విస్తృతమవడం కనిపిస్తోంది. అలాగే ఆ హింసను ఎగదోసే ధోరణులూ ఎక్కువైపోతున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో ఎన్.రామ్, మృణాల్ పాండే, ఫ్రంట్‌లైన్ సంపాదకులు ఆర్.విజయశంకర్, సత్య హింది చైర్మన్, ఎండి నక్వి, ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్ద్ వరదరాజన్, సిద్ధార్ద్ భాటియా, ఎం.కె.వేణు, ఇంక్విలాబ్ కాలమిస్ట్ హసన్ కమల్, సబరంగ్ ఇండియా సహ సంపాదకులు జావేద్ ఆనంద్, కాశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆనురాధా భాసిన్ ప్రభృతులు వున్నారు.
''హింసను రెచ్చగొట్టలా పిలుపివ్వడం....వాటిపై దేశ అత్యున్నత నాయకత్వం కావాలనే మౌనం వహించడం జరుగుతోంది.'' అని ఆ ప్రకటన పేర్కొంది. కరోనా ప్రారంభంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిగి జమాత్ సమావేశాన్ని ఉటంకిస్తూ,.. ముస్లింలను హతమార్చాలంటూ పిలుపిచ్చిన సంఘటనను వారు గుర్తు చేశారు. మీడియాలోని కొన్ని వర్గాలు, ముస్లింల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు 'కరోనా జిహాద్' అన్న పదాన్ని విస్తృతంగా ఉపయోగించాయి. ముస్లింలను సామాజికంగా, ఆర్థికంగా బహిష్కరించాలంటూ శాసనకర్తలు కూడా పిలుపివ్వడం ఆరంభించారు.
అలా మైనారిటీ విద్వేషాన్ని రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు కూడా విఫలమయ్యారని వారు పేర్కొన్నారు. వీరందరూ చట్టానికి అతీతులనే భావన వారిలో పెరగడానికి కారణమయ్యారని విమర్శించారు. హరిద్వార్ ధర్మ సంసద్‌లో నేతల ప్రసంగాలను కూడా ఈ ప్రకటన ప్రస్తావించింది. సోషల్ మీడియా, ఆన్లైన్ వేదికలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుంటుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ఇటువంటి హింసను రెచ్చగొట్టే పిలుపులు అనూహ్యమైన, అధ్వాన్న పరిస్థితులకు దారి తీయకుండా వుండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా భారత రాష్ట్రపతి, సుప్రీం కోర్టు, రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలు, అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు. మీడియాలోని కొన్ని వర్గాలు ఇటువంటి విద్వేష ప్రసంగాలు వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయని ఆ ప్రకటన పేర్కొంది. ఈ సంక్షోభ పరిస్థితుల పట్ల అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా వుందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ వంటి జర్నలిస్టు, మీడియా సంస్థలకు కూడా విజ్జప్తి చేసింది.