Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు
- కేంద్రంపై ప్రజాగ్రహం
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజీల్, గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగదల ఇప్పటికే దేశంలోని వాహనదారులు, వినియోగదారులు, సామాన్య, మధ్యతరగతి ప్రజలను షాక్‌కు గురి చేశాయి. ఆ షాక్ నుంచి కోలుకోకముందే మోడీ ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. తాజాగా సీఎన్జీ గ్యాస్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ గ్యాస్ ధర మరోసారి భగ్గుమన్నది. దీంతో అక్కడి ప్రజలు సీఎన్జీ గ్యాస్ కోసం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీలో సీఎన్జీ ధర 50 పైసలు పెరిగింది. దీంతో సీఎన్జీ కోసం ఢిల్లీ ప్రజలు రూ. 59.01కి బదులుగా రూ. 59.51 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇక నుంచి వాహనదారులకు మరింత భారం కానున్నది.
డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) ధరలు కూడా పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ పీఎన్జీ ధరలను పెంచింది. ఢిల్లీ ఎన్సీఆర్లో స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పీఎన్జీని రూ.1 పెంచారు. ఆ తర్వాత పీఎన్జీ ఇక్కడ యూనిట్‌కు రూ. 36.61కి అందుబాటులో ఉంటుంది. కొత్త ధరలు నేటి నుంచే (మార్చి 24,2022) అమల్లోకి వచ్చాయి. ఈనెల 22న డొమెస్టిక్ ఎల్పీజీ ధర సిలిండర్‌కు రూ. 50 పెంచడంతో ప్రజల వంటగది బడ్జెట్ ఖరీదైంది. ఇప్పుడు పీఎన్జీ ధరలు పెరగడంతో దానిని ఉపయోగించే వారికి వంట ఖర్చు కూడా పెరగనున్నది.
పెరుగుతున్న ధరల విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా తీవ్రంగా విమర్శించారు. పెరిగిన ధరలన్నింటినీ ఉదహరిస్తూ ఉదయాన్నే 'ద్రవ్యోల్బణం ఉదయం' అని అభివర్ణించారు. ఇకపై ఇంటి గ్యాస్‌తో పాటు ఆటో, ట్యాక్సీ, బస్సు ఛార్జీలు కూడా పెరుగుతాయని ఆయన ట్వీట్ చేశారు. ఇటు సామాన్య జనం కూడా మోడీ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.