Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లాష్ సేల్స్.. అమెజాన్ అక్రమ వ్యాపార పద్ధతులు
- చిన్న వ్యాపారులను దెబ్బతీసే వ్యూహాలు
- ఇదేమని అడిగే దిక్కే లేదు : మార్కెట్ నిపుణులు
న్యూఢిల్లీ : సముద్రంలో చిన్న చేపను పెద్ద చేప మింగుతుంది. ఆ పెద్ద చేపను తిమింగలం మింగేస్తుంది. ఈ ఉదాహరణ..మనదేశంలో సూక్ష్మ, చిన్నమధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) యూనిట్లకు సరిగ్గా సరిపోతుంది. ఈ-కామర్స్‌లో మల్టీనేషనల్ కంపెనీ 'అమెజాన్ ఇండియా' పెద్ద తిమింగలంగా మారి..అనేక చిన్న చిన్న రిటైల్ సంస్థల్ని మింగేస్తోంది. దీనిపై కేంద్రంలో మోడీ సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేదు. ఈ-కామర్స్ నిబంధనలు 'అమెజాన్'కు అనుకూలంగా తయారుచేసి పెట్టింది. పెద్ద మొత్తంలో నిధులతో రంగంలోకి దిగే విదేశీ ఈ-కామర్స్ సంస్థలను, దేశీయ ఈ-కామర్స్ సంస్థలను ఒకే గాటన కడుతూ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును రూపొందించింది.
ముఖ్యంగా అమెజాన్ చేపట్టే 'ఫ్లాష్ సేల్స్'పై చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా..పట్టించుకున్న నాథుడే లేడు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్, ఇతర ట్రేడర్స్ అసోసియేషన్స్ ఎన్నో సంత్సరాలుగా పాలకులకు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫ్లాష్ సేల్స్..తమ వ్యాపారాన్ని ఎలా దెబ్బతీస్తుందో కొన్ని వందలమార్లు కేంద్రానికి రాతపూర్వకంగా తెలియజేశాయి. ఇటీవల ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేశాయి. అందులో..''భౌతిక మార్కెట్లలో ఉన్నట్టుగానే ఈ-మార్కెట్లోనూ జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. ఒకే ఉత్పత్తిపై ఆకస్మిక తగ్గింపులు, ఫ్లాష్ విక్రయాలు, హెచ్చు తగ్గులు..ఇతర విక్రయదారుల్ని నష్టపరుస్తున్నాయి. చిన్న చిన్న వ్యాపారులను దెబ్బతీయడానికి అమెజాన్ అమలుజేస్తున్న వ్యూహమిది. ఇదంతా తన వ్యాపారాన్ని విస్తరించడానికి చేస్తోంది. ఉదాహరణకు స్వంత బ్రాండ్ కింద చూపే ఉత్పత్తులు వాస్తవానికి ఇతర కంపెనీలవే. ఇతర కంపెనీలను దెబ్బకొట్టడానికే ఇదంతా'' అని పేర్కొన్నాయి. భారతదేశంలో ఈ-కామర్స్ రంగాన్ని పర్యవేక్షించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాల్ని రూపొందించ లేదని మార్కెట్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) రంగాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన విధానాన్ని తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ఆర్థిక శాఖదే. కానీ ఇదంతా కూడా తమకు అక్కర్లేని వ్యవహారమని పలు విభాగాలు భావిస్తున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ, నిటి ఆయోగ్, డీపీఐఐటీ, ఇతర విభాగాల మధ్య దోబూచులాట నెలకొంది. ఫలితంగా సమగ్రమైన ఈ-కామర్స్ నిబంధనలు అమల్లోకి రావట్లేదని, పర్యావసానంగా దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమ యూనిట్లు, ఇతర వ్యాపారులు నష్టపోతున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.