Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీతో కేరళ సీఎం విజయన్ భేటీ
న్యూఢిల్లీ: సిల్వర్ లైన్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. గురువారం పార్లమెంట్లో ప్రధాని మోడీతో ఆయన దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేరళలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సిల్వర్లైన్కు అనుమతులపై విజ్ఞప్తి చేశారు. సిల్వర్లైన్తో సహా కేరళకు సంబంధించిన వివిధ అంశాలపై విజయన్ చర్చించారు. అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్, రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులతో పినరయి విజయన్ భేటీ అయ్యారు. అనంతరం కేరళ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పినరయి విజయన్ మాట్లాడారు. సిల్వర్ లైన్‌కు అవసరమైన అనుమతులను కేంద్రం వేగవంతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది కేరళ అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. కె-రైల్ ప్రాజెక్ట్‌ను కేరళ ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ జాయింట్ వెంచర్‌తో నిర్మిస్తుందని, ఈ ప్రాజెక్టు కోసం కేరళ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోందని తెలిపారు. కేరళలో సిల్వర్ లైన్ వ్యతిరేక నిరసనలు ప్రజలు చేయటం లేదని, ఆందోళనల వెనుక ''విచిత్రమైన రాజకీయ సంకీర్ణం (బీజేపీ, కాంగ్రెస్, ముస్లీం లీగ్)'' కుట్ర ఉందని ఆరోపించారు. తమపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని పినరయి స్పష్టం చేశారు. ప్రజలు మాతో ఎల్లప్పుడూ ఉన్నారని, మేము ప్రజలతో మాత్రమే ఉంటామని స్పష్టం చేశారు. నిరసనలు చేస్తున్నవారు ప్రజలకు ప్రాతినిధ్యం వహించటం లేదని పినరయి విజయన్ అన్నారు. కొంత మంది ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. నేషనల్ హైవే డెవలప్మెంట్, గెయిల్ పైప్‌లైన్, కుండకుళం నుంచి పవర్ హైవే వంటి ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే జరిగిందని అన్నారు. అయితే ఈ అన్ని సందర్భాల్లో ప్రజలు సత్యాన్ని గ్రహించి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. సిల్వర్ లైన్ విషయంలో కూడా అదే జరుగుతుందని స్పష్టం చేశారు.