Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగాన్ని పరిక్షించడం.. ప్రజల హక్కులను కాపాడటం
- దేశంలో మరింత దిగజారిన పరిస్థితి
- ధరలు పెరుగుదలతో ప్రజలపై ఆర్థిక దాడి
- అత్యంత అధ్వాన్నంగా దేశ ఆర్థిక వ్యవస్థ..
- నిరుద్యోగం, ఆకలి విలయతాండవం : ఏచూరి
న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని పరిక్షించడం, ప్రజల హక్కులను కాపాడటం తమ ప్రాధాన్యతలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. బీజేపీని ఒంటరి చేసి ఓడించడానికి లౌకిక శక్తుల సాధ్యమైన విస్తృత ఫ్రంట్ ఏర్పాటుకు పిలుపు ఇచ్చారు. దేశవ్యాప్తంగా పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. గురువారం జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సీపీఐ(ఎం) నేత యూసఫ్ తరిగామి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏచూరి మాట్లాడుతూ ప్రజాస్వామ్య శక్తులన్నీ తమ విభేదాలను పక్కనపెట్టి దేశాన్ని రక్షించడానికి ముందుకు రావాలని కోరారు. ఎన్నికల విజయాల చట్టబద్ధతను రాజ్యాంగంలోని ప్రాథమిక స్తంభాల ''పూర్తి విధ్వంసం'' కోసం బీజేపీ ఉపయోగిస్తోందని విమర్శించారు. ''దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడం, ప్రజల హక్కులను పరిరక్షించడం అత్యంత ప్రాధాన్యత. ఇందుకోసం బీజేపీని అధికారం నుంచి దింపడం ముఖ్యం.అందుకే బీజేపీని ఒంటరి చేసి ఓడించాలి. అందుకోసం ఎన్నికలు వచ్చినప్పుడల్లా లౌకిక శక్తులతో కూడిన విశాలమైన ఫ్రంట్ అవసరం'' అని ఏచూరి అన్నారు. దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు కాషాయ పార్టీ ''దుర్వినియోగం'' చేస్తుందని విమర్శించారు. ''మేం అన్ని ప్రజాస్వామ్య శక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మన విభేదాలను పక్కన పెడదాం. ఈ దేశాన్ని రక్షించినప్పుడే దేశానికి ఏం కావాలో చర్చించుకోగలం. ముందుకు రండి, దేశం, పౌరుల భవిష్యత్తుకు ఇది చాలా ముఖ్యమైనది'' అని ఆయన అన్నారు.బీజేపీ పాలనలో దేశం ఆర్థిక వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. ప్రజల రోజువారీ సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ''నిరుద్యోగం అత్యంత దారుణంగా ఉంది. దేశ యువతలో 50 శాతానికి పైగా ఉద్యోగాల కోసం వెతకడం మానేశారు. ప్రజలపై ఆర్థిక దాడులు జరుగుతున్నాయి. ఆకలి, నిరుద్యోగం, ధరల పెరుగుదలతో భారాలు పెరిగాయి. ప్రపంచంలోని ప్రతి ఇండెక్స్‌లో భారతదేశం క్షీణించింది. దీనర్థం భారతదేశ పరిస్థితి చాలా వేగంగా క్షీణిస్తోంది'' అని ఆయన పేర్కొన్నారు. ''దేశంలో విక్రయించబడని ఏదీ లేదు. లాభాలు కొంతమందికి వెళ్తాయి. వారెవరో అందరికీ తెలుసు. పొలాలు కూడా వారికి అప్పగిస్తున్నారు'' అని ఏచూరి విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ రాజకీయ అవినీతికి చట్టబద్ధత కల్పించిందని ఆగహ్రం వ్యక్తం చేశారు. ''గత మూడేండ్లుగా ఎలక్టోరల్ బాండ్లకు వ్యతిరేకంగా పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ కోట్లాది రూపాయలను సంపాదించింది. వారు ఎన్నికలలో ఆ డబ్బును ఉపయోగిస్తున్నారు'' అని విమర్శించారు. ఈ క్రమంలో దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి లౌకిక శక్తులన్నీ ఏకం కావడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. దేశంలోని సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని, ఇది దేశానికి ప్రమాదకరమని ఏచూరి అన్నారు. 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సీపీఐ(ఎం)తో సహా దాఖలైన పిటిషన్లు సుప్రీం కోర్టులో విచారణ జరగడం లేదని అన్నారు. ''పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు తీసుకుంటున్న సమయం, చట్టాలను వాస్తవికంగా అమలు చేయడానికి ప్రభుత్వానికి సమయం ఇస్తుంది. దీని కారణంగానే భూ చట్టాలు, డీలిమిటేషన్ మొదలైనవి (మార్పులు) జరుగుతున్నాయి. కనుక పిటిషన్లను త్వరగా విచారించాలి. పిటిషన్లను విచారించే వరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, ప్రవేశపెట్టకుండా నిరోధించాలి'' అని పేర్కొన్నారు.జమ్మూ కాశ్మీర్ ప్రజల చట్టబద్ధమైన రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశంలో జమ్మూకాశ్మీర్ ఒక భాగమని సీపీఐ(ఎం) విశ్వసిస్తోందని, అయితే వారికిచ్చిన వాగ్దానాలు, హామీలను వంద శాతం అమలు చేయాలని డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. ''ప్రభుత్వం సృష్టిస్తున్న అసంతృప్తి, పరాయీకరణ మన దేశ ప్రయోజనాలకు సంబంధించినది కాదు. సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది'' అని ఆయన సూచించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అండగా నిలుస్తామని, రాజ్యాంగం ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అందించిన హామీల అమలుకు కృషి చేస్తామన్నారు.కాశ్మీర్ లోయలో కష్టాలు అనుభవించింది కాశ్మీరీ పండిట్లే మాత్రమే కాదని, ముస్లింలు, సిక్కులు, ఇతరులు కూడా బాధపడ్డారని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని మరింత దిగజార్చాలనే లక్ష్యంతో 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాను విడుదల చేశారని ఏచూరి విమర్శించారు. ''ముస్లింలు, సిక్కులు, కాశ్మీర్ పండిట్లతో సహా అన్ని మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు కాశ్మీర్లో సమానంగా బాధపడ్డారు. సినిమాలో అప్పటి గవర్నర్ పాత్ర ఎందుకు హైలైట్ కాలేదో అర్థం కావడం లేదు. అతని పాత్ర కూడా హైలైట్ అవ్వాలి'' అని ఆయన అన్నారు. కాశ్మీర్ మొత్తం నష్టపోయిందని, ఇక్కడ నాయకులపై కూడా దాడులు చేశారని ఆయన గుర్తు చేశారు. ఉగ్రవాదంపై అందరూ సమానంగా పోరాడుతున్నారని తెలిపారు. కాశ్మీర్ లోయలో ఎవరికి నష్టం జరిగిందో తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింద్ణి యూసఫ్ తరిగామి
జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడులు, అభివృద్ధి, ఉద్యోగ మార్గాలపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలు బూటకమని, వాస్తవం కాదని మహ్మద్ యూసుఫ్ తరిగామి అన్నారు. జమ్మూకాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ వాస్తవంగా కుప్పకూలిందని, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు. రాజ్యాంగ హక్కులను రద్దు చేయడం ద్వారా, చారిత్రాత్మక రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని మాత్రమే కాకుండా జమ్మూ కాశ్మీర్, కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలను బలహీనపరిచిందని విమర్శించారు. దానిని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రాజ్యాంగ హక్కులు, రాష్ట్ర హౌదాను వెంటనే పునరుద్ధరించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామిక నిర్ణయం జమ్మూకాశ్మీర్‌లో పెద్ద రాజకీయ శూన్యతను, అనిశ్చితిని సృష్టించిందని విమర్శించారు. లడఖ్ ప్రజలు కూడా ద్రోహానికి గురవుతున్నారని, ఇప్పుడు రాష్ట్ర హౌదా, గుర్తింపు, భూమి, రాజ్యాంగ భద్రతలతో సహా ఉద్యోగాల రక్షణ కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. జమ్మూలో కూడా అదే పరిస్థితి నెలకొందని చెప్పారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రజల చట్టబద్ధమైన హక్కుల పునరుద్ధరణ కోసం ప్రజాస్వామ్య శక్తులు తమ గళాన్ని వినిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.