Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మభ్యపెట్టే ప్రయత్నాలు మా దగ్గర కాదు : రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ చాలా హేళనగా మాట్లాడారని.. తెలివి తనకు మాత్రమే ఉందన్నట్టు, ఇతరులకు లేదన్నట్టు మభ్యపెట్టే విధంగా మాట్లాడారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను పీయూశ్ గోయల్ అవహేళన చేసేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఢిల్లీలో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
''రా రైసా, బాయిల్డ్ రైసా అనేది మాకు సంబంధం లేదు. ఎట్లా పట్టించుకుంటారో మిల్లర్లతో మీరే పట్టించుకోండి.. మాకేం సంబంధం లేదు. యంత్రాంగం ఉంటుంది కాబట్టీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఫెసిలిటేట్ చేస్తాం. ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. ఇదే విషయం గతంలో అనేక సార్లు చెప్పాం. ఆయా రాష్ట్రాల్లో పండిన పంటలో స్థానికంగా రైతులు, ప్రజల అవసరాలకు పోనూ మిగిలిన పంటలో కొనుగోలు కేంద్రాలకు ఎంత వస్తే అంత కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వానిదే. తెలంగాణలో యాసంగిలో వచ్చే వడ్లను యథాతథంగా తీసుకోవాలి. పంజాబ్లో ఎలా తీసుకుంటున్నారో అలాగే తీసుకుంటామని చెబుతున్నారు. పంజాబ్లో వానాకాలం మాత్రమే వరి పండిస్తారు. రెండో సీజన్లో
గోధుమలు పండిస్తారు. గోధుమలు పిండి పట్టిస్తారా? పత్తి బేళ్లు చేసి ఇస్తేనే తీసుకుంటున్నారా? కంది పప్పు, మినప్పప్పు, శనగపప్పు.. పప్పు పట్టిచ్చి ఇస్తేనే తీసుకుంటున్నారా? వడ్లను కూడా వడ్లలాగానే తీసుకోవాలి. తెలంగాణలో యాసంగిలో వచ్చే వడ్లు యథాతథంగా తీసుకుని డబ్బులు చెల్లించాలి'' అని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నాడు సీఎంగా మోడీ అడిగిందే.. ఇపుడు మేం కూడా...
''కేంద్ర ప్రభుత్వం తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చెప్పిన విషయాలనే మేం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం. తెలంగాణ వినతిపై కేంద్రం స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేకం అని కేంద్ర మంత్రి అన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, సాగునీరు ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా? పండిన పంట కొనకుండా ఇబ్బందులు పెడుతున్నారు. పంట పెట్టుబడి పైసా ఇవ్వకుండా మాపైనే అభాండాలు వేస్తున్నారు. గోదాముల్లో మురిగిపోతున్న ధాన్యాన్ని పేదలకు పంచవచ్చు కదా.. కరోనా సమయంలో పేదలకు 6 కిలోలకు బదులుగా 60 కిలోలు ఇవ్వాల్సింది. కేంద్రం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డాయి. కష్టపడి 25 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గించగలిగాం. వరిసాగు తగ్గించాలని మేమంటే.. పెంచాలని బీజేపీ చెప్పింది. వరి వేయమన్న పెద్దమనిషి కొనుగోలు చేయించాలి. కేంద్ర ప్రభుత్వ ధోరణి ఇలానే కొనసాగితే.. ఏదో రోజు ప్రజలు మోదీ సర్కార్ను ఇంటికి పంపించే రోజు వస్తుంది'' అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజరు, రాజ్యసభ సభ్యులు కేశవరావు, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.