Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర దర్యాప్తు సంస్థలే ఆయుధం
- రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా సోదాలు..విచారణలు
- అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న మోడీ సర్కారు : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ఉపయోగిస్తున్నది. కేంద్రంలో కానీ, రాష్ట్రాల్లో కానీ.. రాజకీయంగా తమకు అడ్డొచ్చినవారిని ఈ సంస్థల దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేసన్ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వంటి దర్యాప్తు సంస్థలను మోడీ సర్కారు ఆయుధంగా వాడుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. ఇందుకు గతంలో ప్రధాని మోడీ 2017 లో ఒక ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 'నోటిని అదుపులో ఉంచుకోండి. మీ పుట్టుపూర్వోత్తరాలు (జనమ్‌పత్రి) నా దగ్గర ఉన్నాయి' అని కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష పార్టీల నాయకులను ఉటంకిస్తూ మోడీ హెచ్చరించారు. ఈ మాటలను నిజం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కే లక్ష్యంతోనే మోడీ సర్కారు వ్యవహరిస్తున్నదని తెలిపారు. తామనుకున్న కార్యం సక్రమంగా జరిగేందుకు మోడీ ప్రభుత్వం ఎంతకైనా వెళ్తుందని వివరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్లో ఉన్నత స్థాయిలో పోస్టులను తాము (కేంద్రం) చెప్తే వినేటువంటి అధికారులకే కట్టబెట్టిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు. ఈ క్రతువులో న్యాయస్థానాల ఆదేశాలున్నప్పటికీ వాటిని బేఖాతరు చేయడం లేదా నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకోవడం కేంద్రానికి పరిపాటిగా మారిందని తెలిపారు. ఈ విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థల్లో అస్మదీయులైన ఉన్నతాధికారులను నియమిస్తూ రాజకీయంగా బలమైన నేతలపై వారిని ప్రయోగిస్తున్నదని గుర్తు చేశారు.ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ హౌం మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత పి. చిదంబంరంపై 2017, మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానిగానే కాకుండా సీఎంగా ఉన్న సమయంలోని మోడీ రాజకీయ ప్రత్యర్థులపై ఇదే వైఖరిని అవలంభించారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. సివిల్ సర్వీసులు, మిలిటరీ, సెక్యూరిటీ సర్వీసులను 'సొంత లక్ష్యం' కోసం వినియోగిస్తూ అంతర్జాతీయ సమాజం ముందు వాటి విలువను తగ్గిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రధాని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి వ్యవస్థలో 'మార్పులను' తీసుకురాలేదని వివరించారు. అయితే, 2014లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చాలా దిగజారిందని తెలిపారు. ప్రతి కేంద్ర దర్యాప్తు సంస్థలో 'పొలిటికల్ వింగ్' క్రమంగా బలోపేతమైందని విశ్లేషకులు చెప్పారు. ఇందుకు సిబ్బంది, సౌకర్యాలు పెరిగిన విషయాన్ని కూడా నొక్కి చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై ఎప్పుడు, ఎలా దాడులు (సోదాలు) జరపాలన్నదానిపై ఇందులోని 'కొందరు' ఉన్నతాధికారులకు అంతర్గత ఆదేశాలుంటాయని వివరించారు. ఇలాంటి దర్యాప్తు సంస్థలకు 'రాజకీయంగా' నమ్మదగిన అధికారులను ఉన్నత స్థానాల్లో నియమిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. తమ ఆదేశాలు, ఆంక్షలకు విరుద్ధంగా పని చేసే అధికారులకు ఉద్వాసన తప్పనిసరి అని తెలిపారు. 2018లో సీబీఐ నుంచి అలోక్ వర్మను తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. 2020 నవంబర్‌లో ప్రస్తుత ఈడీ డైరెక్టర్ సంజరు కుమార్ మిశ్రాకు సర్వీసును ప్రత్యేకంగా పొడిగించారని తెలిపారు. ఇలాంటి అధికారులను సర్వీసులో కొనసాగించే క్రమంలో రాష్ట్రపతి ఉత్తర్వులు, న్యాయస్థానం ఆదేశాలు వంటివి అడ్డు వస్తే నిబంధనలను సవరించిన సందర్భాలూ అనేకం ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు. 2016లో, గుజరాత్ కేడర్ పోలీసు అధికారి రాకేశ్ ఆస్తానాను సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా తీసుకొచ్చారు. గుజరాత్లో పాటు అహ్మదాబాద్ బాంబు పేలుళ్లు వంటివి రాజకీయంగా సున్నితమై అనేక కేసులలో దర్యాప్తు జరిపారు. రాకేశ్ ఆస్తానాకు లైన్ క్లియర్ చేయడానికి సీబీఐ ప్రత్యేకే డైరెక్టర్ ఆర్.కే. దత్తను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ఈ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం అనేక సార్లు కలుగజేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది జులైలో రాకేశ్ ఆస్తానాను ఢిల్లీ పోలీసు కమిషనర్ గా నియమించడం కోసం సర్వీసు రూల్స్‌ను మరొకసారి సవరించారు. అయితే, ఇది ఆయన పదవీ విరమణకు కొన్ని గంటల ముందే జరగడం గమనార్హం. కేంద్రం చేతిలో పావు గా మారిన దర్యాప్తు సంస్థల బాధితులుగా దేశంలోని అనేక రాజకీయ పార్టీలు నిలిచాయనీ, ఇలాంటి పరిస్థితులు ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమస్యను లేవనెత్తి అభివృద్ధికి ఆటంక ంగా మారాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు.