Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలంగాణలో 809 మంది వీధి బాలలు ఉన్నారని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఫిబ్రవరి 15 నాటికి తెలంగాణలో కుటుంబ సమేతంగా వీధుల్లో బతుకుతున్న పిల్లలు 113 మందికాగా, పగటిపూట వీధుల్లో ఉంటూ సమీపంలోని మురికివాడలు, గుడిసెలలో నివసించే వారి కుటుంబాలతో రాత్రికి ఇంటికి తిరిగి వెళ్లే పిల్లలు 690 మంది అని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 738 వీధి బాలలు ఉన్నారని చెప్పారు. కుటుంబ సమేతంగా వీధుల్లో బతుకుతున్న పిల్లలు 490 మందికాగా, పగటిపూట వీధుల్లో ఉంటూ సమీపంలోని మురికివాడలు, గుడిసెలలో నివసించే వారి కుటుంబాలతో రాత్రికి ఇంటికి తిరిగి వెళ్లే పిల్లలు 235 మంది ఉన్నారు. దేశం మొత్తం 17,914 మంది వీధి బాలలు ఉన్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కోర్టుల్లో 4 కోట్ల కేసులు పెండింగ్
దేశంలో వివిధ కోర్టుల్లో 4,07,12,190 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 మార్చి 2 వరకు సుప్రీం కోర్టులో 70,154కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నా రు. 2022 మార్చి 21 నాటికి హైకోర్టుల్లో 58,94,060 కేసులు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 4,10,47,976 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.2022 మార్చి 14నాటికి సుప్రీం కోర్టులో రెండు,23 హైకోర్టుల్లో 405 న్యాయమూర్తుల ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఏపి హైకోర్టులో 11, తెలంగాణ హైకోర్టులో 23 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దేశంలో జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 5,180 జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఏపిలో 120, తెలంగాణలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
ఇండియన్ ఆర్మీలో ఉమెన్ వింగ్ లేదు
ఇండియన్ ఆర్మీలో ప్రత్యేక ఉమెన్ వింగ్ లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.ప్రస్తుతం ఇండి యన్ ఆర్మీలో 10వేర్వేరు ఆర్మీ, సేవల్లో మహిళా అధికారులు నియమితులయ్యారని, ప్రస్తుతం 100మంది మహిళా సైనికులు కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు.
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల డేటా తమ వద్ద లేదు
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల డేటా తమ వద్ద లేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ తెలిపారు. ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ''విదేశాలకు వెళ్లే భారతీయ పౌరుల డేటాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించదు. ప్రపంచ వ్యాప్తంగా 13 మిలియన్లకు పైగా భారతీయలు ఉన్నట్లు అంచనా. తద్వారా భారతదేశం అతిపెద్ద వలసలు వెళ్లే దేశంగా నిలిచింది'' అని తెలిపారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు వీసా తీసుకున్న వారు 2020లో 70,26,960 మంది కాగా, 2021లో 82,48,870 మంది అని పేర్కొన్నారు.