Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీఎస్సీని ఆదేశించిన సుప్రీం
- స్వాగతించిన ఎన్పీఆర్డీ
న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్ రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన వికలాంగ అభ్యర్ధులు ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ రైల్వేస్ ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ (ఐఆర్పిఎఫ్ఎస్), ఢిల్లీ, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలి, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్ పోలీసు సర్వీసు (డీఎఎన్ఐపీఎస్) ల్లో ఎంపిక కోసం యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)కు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 1వరకు గడువును సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు కొరియర్ ద్వారా లేదా స్వయంగా అందించిన దరఖాస్తులు తీసుకోవాలంటూ యుపిఎస్సి సెక్రటరీ జనరల్‌ను సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ సర్వీసుల నుంచి వికలాంగులను మినహాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేసిన ఎన్జిఓ ఎన్పిఆర్డి పిటిషన్‌పై వెలువడిన తీర్పుకు అనుగుణంగా ఈ దరఖాస్తులు పరిశీలించబడతాయని కోర్టు పేర్కొంది. సివిల్ సర్వీసెస్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎంపిక క్రమం నిరాటంకంగా సాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఏప్రిల్ 5 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. మార్చి 24తోటే గడువు ముగిసిన కారణంగా ఈ సర్వీసుల్లో వివిధ శాఖలపై తమ ప్రాధాన్యతలను వికలాంగులు ఇవ్వలేకపోయారని ఎన్జిఓ తరపున న్యాయవాది అరవింద్ దతార్ పేర్కొన్నారు. వారు డిఎఎఫ్2 ఫారాలను పూర్తి చేయాల్సిన అవసరం వుంది. సివిల్ సర్వీసెస్‌లో వారు పాసయ్యారు. ఇప్పుడు వారి ప్రాధాన్యతలు తెలియజేయాల్సివుంది. వాటిని తొలగించడం వల్ల ఆ ఫారాలను పూర్తి చేయలేకపోయినట్లు దతార్ తెలియజేశారు.
స్వాగతించిన ఎన్పీఆర్డీ
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వికలాంగ అభ్యర్థులు యుపీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అంగీకరిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని జాతీయ వికలాంగ హక్కుల వేదిక (ఎన్పిఆర్డి) స్వాగతించింది. వికలాంగులను ఈ సర్వీసుల్లో చేర్చుకోకుండా మినహాయిస్తూ వికలాంగుల సాధికారతా విభాగం (డీఈపీడీ) జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఎన్పీఆర్డీ సవాలు చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, పైగా సమానత్వం, వివక్షారాహిత్యం ఆదేశిక సూత్రాలుగా వున్న వికలాంగుల చట్ట స్ఫూర్తికి వ్యతిరేకమని పేర్కొంది. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలకు సంబంధించి పర్సనాలిటీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా ప్రాధాన్యతలు ఎంచుకునేందుకు అనుమతించాలని ఎన్పిఆర్డి తరపు న్యాయవాది కోరారు.