Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా-ఉక్రెయిన్ వివాదం
- వల్లే పెట్రో ధరల పెంపు : నిర్మలా సీతారామన్
- ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల విలీన బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
- తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తును పూర్తి చేస్తూ కొత్త పన్నుల అమలుకు దారితీసే ఆర్థిక బిల్లుకు శుక్రవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 39 అధికారిక సవరణలను ఆమోదించి, వాయిస్ ఓటింగ్ ద్వారా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలను తిరస్కరించిన తర్వాత ఆర్థిక బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఆర్థిక బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ నిర్మలా సీతారామన్ కోవిడ్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు నిధులు సమకూర్చడానికి కొత్త పన్నులను వేయని ఏకైక దేశం భారతదేశమని అన్నారు. పెట్రో ధరల పెరుగుదలకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ పరిస్థితులే కారణమని, సామాన్యులపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. దానికీ ఎన్నికల సమయానికీ సంబంధం లేదన్నారు. అధిక ద్రవ్యోల్బణం, 2022-23 బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి పన్ను మినహాయింపు లేకపోవడంపై ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవ డానికి, 1951లో పెరుగుతున్న ఆహార ధరల మధ్య కొరియా యుద్ధాన్ని నిందిస్తూ భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేశారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలలా కాకుండా, మహమ్మారి వ్యయానికి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు మనదేశంలో పన్నులను పెంచలేదని ఆమె చెప్పారు. కార్పొరేట్లకు తక్కువ పన్ను వేయడంపై స్పందిస్తూ, 2019 సెప్టెంబర్‌లో ప్రకటించిన పన్ను రేట్ల తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు, ప్రభుత్వానికి, కంపెనీలకు సహాయపడిందని తెలిపారు. 2018-19లో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 6.6 లక్షల కోట్లు అని, కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ, ఇప్పటికే రూ. 7.3 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను వసూలు చేశామని వివరించారు.
ఢిల్లీలో ఉన్న మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)లను విలీనం చేసి ఒక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలనే బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శుక్రవారం లోక్‌సభలో కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్ రారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు-2022ని ప్రవేశపెట్టారు. ఆర్ఎస్పి, కాంగ్రెస్, బిఎస్పి తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఢిల్లీలోని దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు మూడింటినీ ఒకే కార్పొరేషన్‌గా ఏకీకరణను ఈ బిల్లు స్పష్టం చేస్తుంది. మొత్తంగా 250 వార్డులకు పరిమితం చేస్తుంది. వార్డుల పరిధిని స్పష్టం చేయడానికి కొత్త డీలిమిటేషన్ నిర్వహిస్తారు. షెడ్యూల్డ్ కులాలు, మహిళలకు రిజర్వు చేయబడిన స్థానాలను గుర్తిస్తారు. దీని అర్థం ఎంసిడి 2022 ఎన్నికలు వాయిదా వేయబడతాయి. కొత్త కార్పొరేషన్ ఏర్పడే వరకు ఎంసిడి పని పర్యవేక్షణకు ''ప్రత్యేక అధికారి'' నియామకాన్ని బిల్లు సూచిస్తుంది.
ఖైదీల ఓటు హక్కుపై అడిగిన ప్రశ్నకు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం లోక్‌సభలో ఇచ్చిన సమాధానంపై జెడియు నేత రాజీవ్ రంజన్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు వాస్తవాలను, ప్రశ్నల సున్నితత్వాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎల్‌జెఎస్‌పి సభ్యుడు చందన్ సింగ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ దేశంలో ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ప్రతి ఓటరుకు ఉందని, జైళ్లలో ఉన్నవారు కూడా ఓటు వేయమని ప్రోత్సహిస్తున్నారని, ఓటర్లకు ఓటు వేయడం తప్పనిసరి చేయడం సాధ్యం కాదని మంత్రి అన్నారు. ''జైలులో, జైలు వెలుపల ఎవరికైనా ఓటు వేసే హక్కు ఉందని మంత్రి చెప్పారు. నా అభిప్రాయం ప్రకారం ఇది వాస్తవాలకు అతీతమైనది'' అని రాజీవ్ సింగ్ అన్నారు. ఒక వ్యక్తిని జ్యుడీషియల్ కస్టడీకి పంపినప్పుడు, అతని ప్రాథమిక హక్కులు హరించబడతాయని, ఓటు వేయడం ప్రాథమిక హక్కు అని ఆయన అన్నారు.
ఆక్సిజన్ కొరత వల్ల ఏ రాష్ట్రంలోనూ మరణాలు లేవు
ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా మరణాలపై వివరాలను అందించాలని కేంద్రం చేసిన అభ్యర్థనలకు కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించాయని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. వాటిలో ఏవీ ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలను ధ్రువీకరించలేదని చెప్పారు.
2016లో గుండె జబ్బుల వల్లే 28 శాతం మరణాలు
1990లో 15.2 శాతంతో పోలిస్తే 2016లో భారతదేశంలో మొత్తం మరణాలలో 28 శాతానికి పైగా గుండె జబ్బులు కారణమని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్ తెలిపారు. దేశంలోని మరణాలలో 63శాతం నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల వల్ల సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.