Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి నవోదయాల కేటాయింపునకు డిమాండ్
- పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన
- తెలంగాణపై అన్నివిధాల కేంద్రం వివక్ష సరికాదు
- టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంపై నిలువునా నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ద్వంద్వ తెలంగాణ వ్యతిరేక వైఖరిపై పోరాటాన్ని ఢిల్లీ వేదికగా ఎంపీలు మరింత ఉధృతం చేశారు. రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే తెలంగాణలో జిల్లాకో నవోదయ విద్యాలయాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం లోక్సభ ప్రారంభం కాగానే, టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ ఓంబిర్లాకు వాయిదా తీర్మానం ఇచ్చారు. సాధారణంగా జిల్లాకు ఒక నవోదయ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు జవహర్ నవోదయ విద్యాలయాలు జిల్లాకు ఒకటి కంటే ఎక్కువ కేటాయించారని వివరించారు. తెలంగాణకు మాత్రం జిల్లాకి ఒకటి కూడా ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై న్యాయం జరిగేందుకు సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను, ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. ఎంపీ నామ విజ్ఞప్తిని స్పీకర్ ఓంబిర్లా తిరస్కరించడంతో టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి బయటికి వచ్చి వారంతా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి.. నిరసన తెలిపారు. తెలంగాణపై అన్నిరకాల వివక్ష సరికాదని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గత ఎనిమిది ఏండ్లుగా లేవనెత్తుతూనే ఉన్నామని గుర్తు చేశారు. కొత్తగా నవోదయ విద్యాలయ ఏర్పాటు గురించి వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు. వాటిని అనుమతించకపోవటంతో ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని స్పష్టం చేశారు. 23 జిల్లాల్లో కొత్తగా నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, ఎంపీలు వినతి పత్రం ఇచ్చినా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 33 జిల్లాలు ఉంటే గతంలో ఇచ్చిన 9 మినహాయిస్తే కొత్తగా ఒక్క నవోదయ విద్యాలయాన్ని కూడా కొత్తగా కేటాయించలేదని నామ వివర్శించారు. నవోదయ విద్యాలయ పనితీరులో కేరళ తర్వాత రాష్ట్రంలో తెలంగాణ ఉందని ఎంపీ నామ చెప్పారు. ఇటీవల 80 నవోదయ విద్యాలయాలు కొత్తగా కేంద్రం మంజూరు చేస్తే అందులో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని నామ పేర్కొన్నారు.