Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనాకు తెలియజేసిన భారత్
- ఉక్రెయిన్ సహా పలు అంశాలపై అభిప్రాయాల మార్పిడి
న్యూఢిల్లీ : సరిహద్దు ప్రాంతాల్లో చైనా చర్యల ఫలితంగా కల్లోలమైన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు విదేశాంగమంత్రి జైశంకర్ శుక్రవారం చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశానంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు మూడు గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని జైశంకర్ వ్యాఖ్యానించారు. సరిహద్దుల వద్ద పెద్ద సంఖ్యలో బలగాలు మోహరించి వున్నపుడు సాధారణ పరిస్థితులనేవి నెలకొనవని అన్నారు. గత రెండేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతల ప్రభావం కనిపిస్తూనే వుందన్నారు. ఈ విషయంపై భారత్ మనోభావాలను నిజాయితీగా, స్పష్టంగా తెలియజేసినట్లు తెలిపారు. 2020 ఏప్రిల్ నుంచి చైనా మోహరింపుల వల్ల తలెత్తిన ఘర్షణలు, ఉద్రిక్తతల విషయంలో ఏ విధంగానూ రాజీపడలేదన్నారు. ఆ ఉద్రిక్తతలను సడలించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా, ఆశించిన దానికన్నా మందగమనంతో సాగుతున్నాయన్నారు. ఆ చర్యల క్రమాన్ని వేగిరపరిచేందుకే ఈ చర్చలు ఉద్దేశించబడ్డాయి.
ఆఫ్ఘనిస్తాన్, ప్రాంతీయ సమస్యలు, సమకాలీన అంశాలపై ఇరు పక్షాలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాయి. ఐక్యరాజ్యసమితి తీసుకురావాల్సిన సంస్కరణలపైనా ఇరువురు మాట్లాడుకున్నారు. కోవిడ్ కారణంగా భారతీయ విద్యార్థులను తిరిగి చైనాకు అనుమతించకపోవడం పట్ల భారత్ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. వివక్షారహితమైన దృక్పథాన్ని చైనా అనుసరిస్తుందని ఆశిస్తున్నట్లు జైశంకర్ చెప్పారు. ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు ఆతిధ్యమివ్వడంపై వాంగ్ చర్చించారు. ఆఫ్ఘనిస్తాన్పై పొరుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి రావాల్సిందిగా తనకు ఆహ్వానం అందలేదని జైశంకర్ చెప్పారు. క్వాడ్‌కు సంబంధించిన విషయాలేవీ వాంగ్ ప్రస్తావించలేదన్నారు. భారత్‌తో స్వతంత్ర విధానాన్ని చైనా అనుసరించాలని ఆశిస్తున్నట్లు తాను తెలియజేశానని జైశంకర్ చెప్పారు. ఉక్రెయిన్‌పై ఇరు పక్షాలు వారి అభిప్రాయాలను పంచుకున్నాయని తెలిపారు. తక్షణమే కాల్పుల విరమణ జరిపి, చర్చలు చేపట్టాలని ఇరు వర్గాలు అభిప్రాయపడ్డాయన్నారు. విద్య, వీసా, వాణిజ్యం వంటి పలు అంశాలపైనా ఇరువురు చర్చించారు.