Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాబా రామ్‌దేవ్‌కు బంపర్ ఆఫర్
- రుచి సోయా ఎఫ్పీఓతో 4300 కోట్లు
- దివాళాతో బ్యాంక్‌లకు తొలుత భారీ నష్టం
- ఫలించిన క్రోనీ క్యాపిటలిజం..!
మేం సర్వసంగ పరిత్యాగులం..మాకు ఆస్తులు.అంతస్థులు అక్కర్లేదని వినిఉంటాం. కానీ ఇపుడు బాబాలు..స్వాములు వేలకోట్ల సామ్రాజ్యాలను నిర్మిస్తున్నారు. అత్యంత విలాసమైన భవంతులు..సకల సౌకర్యాలతో భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. ఈ బాబాలు...పైసా పెట్టుబడి లేకుండా వేల కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా ఎఫ్పీఓతో బాబా రామ్‌దేవ్ మాత్రం ఎలాంటి పెట్టుబడి లేకుండా 80 శాతం వాటాతో రూ.31వేల కోట్ల కోట్ల సంపదను పొందడం కొసమెరుపు. చివరికి మోడీకి సన్నిహితుడైన అదానీకి చెందిన విల్మర్ సంస్థ..రామ్‌దేవ్ బాబా కోసం పోటీనుంచి విరమించుకున్నదంటే...బీజేపీ పెద్దల పాత్ర ఎంతగా ఉన్నదో స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ : యోగా గురు నుంచి వ్యాపారవేత్తగా మారిన బాబా రామ్‌దేవ్ నాలుగేండ్ల కిందట రుచి సోయా స్వాధీనంతో బడా కార్పొరేట్ల సరసన చేరిపోయారు. భారీ నిధుల సమీకరణలో భాగంగా రుచి సోయా ఈ నెల 24-28 తేదిల్లో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ)కు రావడంతో రామ్‌దేవ్‌పై క్రోనీ క్యాపిటలిజం ఆరోపణలు మరోసారి తెర మీదకు వస్తున్నాయి.
4,300 కోట్లు సమీకరించాలని లక్ష్యం...
మార్చి 28 వరకు కొనసాగనున్న ఈ ఇష్యూలో సుమారు రూ.4,300 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పతంజలికి రుచి సోయాలో ప్రస్తుతం 98.9 శాతం వాటాలు ఉన్నాయి. బ్యాంక్‌ల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించలేక లిస్టెడ్ కంపెనీ రుచి సోయా 2017లో దివాలాకు వెళ్లింది. దీంతో బ్యాంక్‌లకు చెల్లించాల్సిన రూ.12,146.13 కోట్ల అప్పులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఎస్బీఐ రద్దుచేసింది.రూ.933 కోట్లు
ఈ ఖాతాలో ఒక్క ఎస్బీఐనే రూ.933 కోట్లు రద్దు చేసింది. మరో రూ.1,816 కోట్లకు గాను రూ.883 కోట్ల రికవరీతో సరిపెట్టుకుంది. పీఎన్బీ, సీబీఐ తదితర ఇతర బ్యాంక్‌లు ఇచ్చిన రుణాల్లో సగం మేర రద్దు
చేసుకోవాల్సి వచ్చింది. ఎన్సీఎల్టీ 2018 డిసెంబర్లో నిర్వహించిన బిడ్డింగ్‌లో రుచి సోయాను అనుహ్యాంగా పతంజలి దక్కించుకుంది. ఇందుకోసం రూ. 4,350 కోట్లు చెల్లించనున్నట్టు పేర్కొంది. ఇందులోనూ రూ.3250 కోట్లు తిరిగి బ్యాంక్‌ల నుంచి రుణ గ్యారంటీనే ఇవ్వడం గమనార్హం. రుణాలకు భద్రతగా బ్యాంకులు రుణ పునర్ వ్యవస్థీకరణకు అవకాశం కల్పించాయి.
రుచిసోయా షేర్ల ట్రేడింగ్‌లో ధరల మోసాలు..?
పతంజలి ఈ సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత రుచి సోయా షేర్ల ట్రేడింగ్‌లో ధరల మోసం జరుగుతుందనే ఆరోపణలు వచ్చాయి. రుచి సోయలో కేవలం ఒక్క శాతం వాటాలు మాత్రమే స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడంతో అమ్మేవారు లేక రెండేండ్లలో ఆ కంపెనీ షేర్ రూ.3.50 నుంచి రూ.1053కి చేరింది. దీంతో కంపెనీ విలువ కూడా రూ.31 వేల కోట్ల పైకి ఎగబాకింది. తాజాగా ఇందులో 20 శాతం వాటాలను విక్రయించడం ద్వారా రూ.4300 కోట్లు సమీకరించాలని రామ్‌దేవ్ బాబా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కంపెనీలోని 100 శాతం వాటాలను రూ.4350 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బ్యాంకులు వేల కోట్లు రద్దు చేశాయి. అవే బ్యాంక్‌లు ఇప్పుడు క్యూఐపీ పద్దతిలో ఈ సంస్థలోని వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో దివాలాకు ముందు ప్రారంభ వాటాదారులు పూర్తిగా నష్టపోయారు. డిపాజిటర్లు, వాటాదారులకు నష్టం జరిగింది. కానీ.. తాజా ఎఫ్పీఓతో బాబా రామ్‌దేవ్ మాత్రం ఎలాంటి పెట్టుబడి లేకుండా 80 శాతం వాటాతో రూ.31వేల కోట్ల కోట్ల సంపదను పొందడం కొసమెరుపు.
రుచిసోయా కోసం అదానీ, పతంజలి గ్రూప్స్ పోటీ
దివాలా ప్రక్రియ కింద రుచి సోయాను దక్కించుకోవడానికి తొలుత అదానీ విల్మర్, పతంజలి మాత్రమే పోటీ పడ్డాయి. మధ్యలో ఏమి జరిగిందో తెలియదు అదానీ విల్మర్ బిడ్డింగ్ నుంచి అనుహ్యంగా వైదొలిగింది. ప్రధానీ మోడీకి అత్యంత సన్నిహితుడైన రామ్‌దేవ్ బాబా కంపెనీ చౌకగా రుచి సోయాను దక్కించుకుంది. ఇందులో క్రోనీ క్యాపిటలిజం చోటు చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి.