Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య తగాదా కాదు
- రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం
- వాగ్దానాలను మరిచిపోయిన కేసీఆర్
- ఆర్టీసి, విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
న్యూఢిల్లీ : ధాన్యం కొనుగోలు సమస్యపై అఖిలపక్షం వేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య తగాదా కాదనీ, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమని అన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో విలేకరులతో శనివారం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసి, విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచిందని విమర్శించారు. హైదరాబాద్ సిటీలో బస్ టిక్కెట్టుపైన రూ.5, రూరల్ ప్రాంతాల్లో రూ.2 చొప్పున పెంచారని తెలిపారు. విద్యుత్ నష్టాలకు ప్రభుత్వ అసమర్థతే కారణమన్నారు. ఇండ్లకు యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య
అవసరాలకు రూ.1 చొప్పున పెంచారని తెలిపారు. దీంతో ప్రజలపై దాదాపు ఐదారు వేల కోట్ల భారంపడుతుందన్నారు. గతంలో చంద్రబాబు పెంచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయనీ, చివరికి ప్రభుత్వం గద్దె దిగడానికి దారితీసిందని గుర్తుచేశారు. ఆనాటి కంటే, ఇప్పుడు అనేక రెట్లు పెంపుదల జరిగిందన్నారు. దీన్ని సీపీఐ(ఎం)తో పాటు అన్ని వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే సీపీఐ(ఎం) ఆందోళన బాట పట్టిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయని అన్నారు. విద్యుత్ ధరల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే, ఈ ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టడం అనాలోచిత నిర్ణయమనీ, దీన్ని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తున్నదని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లుపై కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్ర మంత్రులు ఢిల్లీ వచ్చి నిలదీయడం మంచి పరిణామమన్నారు. ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, కేంద్రమే డబ్బు చెల్లించిందని అన్నారు. కాకపోతే.. మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం తామే కొంటున్నామని రాజకీయ లాభం కోసం మాట్లాడిందని విమర్శించారు. గతంలో ఎలా అయితే బాధ్యతగా కేంద్రం కొనుగోలు చేసేందో, ఇప్పుడు కూడా అలానే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అదే డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. కానీ న్యాయమైన డిమాండ్‌ను పట్టించుకోకుండా కేంద్ర మంత్రులు బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను, వారి ఆహార అలవాట్లను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. ఇది చాలా దారుణమనీ, దీన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తున్నదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలోనే కాదు, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా మాట్లాడుతున్నారనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇదే సరైనదేనన్నారు. రాష్ట్ర హక్కుల కోసం గట్టిగా నిలబడాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామనీ, ఇప్పటికైనా కెసిఆర్ ఆ విషయాన్ని గ్రహించడం సంతోషకరమని అన్నారు.
ఈ వైఖరిని తాము సమర్థిస్తున్నామన్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా తీసుకుంటున్న వైఖరిలో రెండు లోపాలు ఉన్నాయనీ, వాటిని సవరించుకోవాలని టీఆర్ఎస్కు సలహా ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై కేవలం టీఆర్ఎస్, బీజేపీ తగాదలా కనిపిస్తోందనీ, ఇది సరైనది కాదని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించిన అంశమనీ, వ్యవసాయ రంగానికి, రైతాంగానికి సంబంధించిన అంశమని స్పష్టంచేశారు. ఈ సమస్యపై అన్ని రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవటం ద్వారా ఈ సమస్యకు మరింత బలం చేకూరుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, దిగిరావడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. కానీ టీఆర్ఎస్, కేసీఆర్ అలా ఆలోచించకపోవడం సరైందికాదన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యపై అఖిలపక్షాన్ని వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులను హరించడంపై కేసీఆర్ పోట్లాడటం సమర్థనీయమేననీ, కానీ దీనిలో రాజకీయాలు మిళితం చేయడం మంచిది కాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పడాలనీ, ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాడాలనే వాదన ఆయన తీసుకొస్తున్నారని అన్నారు. ఈ రకంగా రాజకీయాలను, కేంద్ర, రాష్ట్ర సంబంధాల సమస్యను మిళితం చేయడం తప్పని స్పష్టం చేశారు. రాజకీయాలు మిళితం చేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర సంబంధాల అంశం బలహీన పడుతుందని సీపీఐ(ఎం) భావిస్తోందన్నారు. అనేక ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమస్యపై కలిసొచ్చే అవకాశముందనీ, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఆలోచనల్లో పడకతప్పని పరిస్థితి వస్తుందని అన్నారు.
ఎన్నికల ముందు ఫ్రంట్లు ఎక్కడా విజయవంతం కాలేదనీ, చరిత్ర చెబుతున్న అనుభవమని స్పష్టంచేశారు. కేసీఆర్ చేసిన వాగ్దానాలను మరిచిపోయారని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని అసెంబ్లీలో స్పష్టమైన హామీ ఇచ్చారనీ, కానీ ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారని విమర్శించారు. అడవుల్లోకి పోయి బుల్డోజర్లతో కందకాలు తవ్వుతున్నారనీ, అక్రమ కేసులు పెట్టించి, వ్యవసాయాలు ఆపించి, గిరిజనలను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలన్నీ అడవి భూముల్లోకి వెళ్లి హెచ్చరించిన తరువాతే ఆ నిర్బంధం ఆగిందన్నారు. ఇప్పటికైనా అన్నమాట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటితరంగం కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళిత బంధు పథకం, దళితులకు మూడెకరాల భూమి వంటి వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి అమలు జరగలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తీసుకొస్తున్నారనీ, ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారని తెలిపారు. వాగ్దానాల అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యచరణకు పూనుకోవాలని సీపీఐ(ఎం) భావించిందని అన్నారు. వామపక్షాలు, ఇతర పార్టీలతో కలిపి ఆందోళన చేపడతామని తెలిపారు.