Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందు బిళ్లలు, ఔషధాలు మరింత ప్రియం..
- 11శాతం ధరలు పెంచుకోవడానికి మోడీ సర్కార్ అనుమతి
- ఏప్రిల్ 1 నుంచి 850కిపైగా మందుల ధరల్లో మార్పు
- జాబితాలో జ్వరం, నొప్పులు, యాంటీ బయాటిక్స్, గుండె, చర్మ వ్యాధుల మందులు
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంపుతో వణికిపోతున్న సామాన్యుడికి మోడీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ముఖ్యమైన ఔషధాలు, మందు బిళ్లల ధరలు పెంచుకోవడానికి ఔషధ తయారీ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. జ్వరం, నొప్పులు, యంటిబయాటిక్స్, గుండె, చర్మ రోగాలు, మధుమేహం, బీపీ మాత్రలు, విటమిన్ గోళీలు..ఇలా 850 వరకూ ఉన్న షెడ్యూల్ డ్రగ్స్ (అత్యావశ్యక ఔషధాలు) ధరలు దాదాపు 11శాతం పెరగనున్నాయి. ధరల పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని గతకొంత కాలంగా ఔషధ తయారీ కంపెనీలు చేసిన లాబీయింగ్‌కు మోడీ సర్కార్ తలొగ్గిందని నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : కోట్లాది కుటుంబాలకు మోడీ సర్కార్ మరో పిడుగులాంటి వార్త వెలువరించింది. సర్వసాధారణంగా వాడే (జ్వరం, నొప్పులు, చర్మవ్యాధులు, బీపీ, షుగర్, విటమిన్లు..మొదలైనవి) 850కుపైగా మందు బిళ్లలు, ఔషధాల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. షెడ్యూల్ డ్రగ్స్ జాబితాల్లో ఉన్న మందులు, ఔషధాల ధరలను 10.7శాతం పెంచుకోవచ్చునని 'నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ' (ఎన్పీపీఏ) ఒక ప్రకటన జారీచేసింది. క్యాలెండర్ సంవత్సరం 2020-21లో 'టోకు ధరల సూచిక' ఆధారంగా ధరల మార్పుపై నిర్ణయం తీసుకున్నామని ఆ ప్రకటనలో తెలియజేసింది. టోకు ధరల సూచికకు సంబంధించి కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం, 2020, 2021 క్యాలెండర్ సంవత్సరాల్లో వార్షిక మార్పు 10.77 (సుమారుగా 11శాతం) ఉందనేది లెక్క తేలిందని 'ఎన్పీపీఏ' పేర్కొన్నది. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు-2013 ప్రకారం, షెడ్యూల్ డ్రగ్స్‌కు(ఇవి 850కు పైగా ఉన్నాయి) సంబంధించి ధరల మార్పు చేయాలంటే ఎన్పీపీఏ అనుమతి తప్పనిసరి. టోకు ధరల సూచిక గణాంకాల ఆధారంగా ప్రతి ఏటా ఎన్పీపీఏ ఔషధ ధరల మార్పుపై నిర్ణయం తీసుకుంటుంది. షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ డ్రగ్స్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని దేశంలోని వెయ్యికిపైగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు మోడీ సర్కార్‌పై ఒత్తిడి చేస్తున్నాయి. ముడి సరుకుల ధరలు, ఇన్పుట్ వ్యయం పెరిగాయని..ధరల మార్పుకు అంగీకారం తెలపాలని లాబీయింగ్ చేపట్టాయి. ఈనేపథ్యంలో ఔషధాల ధరలపై సమీక్ష అనంతరం 11శాతం పెంచుకోవచ్చునని ఈ ఏడాది మార్చి 25న ఎన్పీపీఏ తుది నిర్ణయం వెలువరించింది.2019లోనూ ఔషద కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 2 శాతం, 2020లో 0.5 శాతం పెంచుకునేలా అవకాశం కల్పించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కార్పొరేట్ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. గత రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో అనేక కుటుంబాల ఆర్థిక పరిస్థితి బలహీనంగా తయారయ్యింది. అధిక ఇంధన ధరలతో దేశంలో అన్ని రకాల ఉత్పత్తుల ధరలు ఎగిసిపడటంతో ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో అత్యవసర ఔషదాల ధరలను పెంచడంతో ప్రజలకు వైద్యం కూడా మరింత భారం కానుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రజలపై భారం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వైద్యం ఇప్పటికే సామాన్యులకు దూరంగానే ఉంటున్నది. పేదలు, జర్నలిస్టులు, ఉద్యోగుల కోసమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పథకాలు అమలు చేస్తున్నా.....రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా మందులను ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అనివార్యం ప్రయివేటు మెడికల్ షాపుల నుంచి వాటిని కొనుగోలు చేసుకుంటున్న విషయం విదితమే. తాజా పెరుగుదల వీరికి శాపంగా మారనున్నది.
తగ్గించాలి....డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి
అత్యవసర మందుల ధరలను పెంచడం సరైన నిర్ణయం కాదని రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ ఆకుల సంజరు రెడ్డి అభిప్రాయపడ్డారు. అత్యవసరమంటేనే వాటి ధరలను తగ్గిస్తూ ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు రూపొందించిన జాబితా అని తెలిపారు. ఇప్పటికే ఆహారానికి సంబంధించిన నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్న కేంద్ర సర్కారు...అత్యవసర మందుల ధరలను పెంచుతున్న కూడా పెంచితే సామాన్యులు బతికేదెలా? అని ప్రశ్నించారు. ఇలాంటి తిరోగమన చర్యలను ఉపసంహరించుకోకుంటే ఆయుష్మాన్ భారత్ లాంటి ఎన్ని పథకాలు పెట్టినా ప్రయోజనం ఉండబోదని స్పష్టం చేశారు. తక్షణం ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.