Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిశాలోని బాలాసోర్ తీరంలో మీడియం రేంజ్ పరీక్ష
న్యూఢిల్లీ : మరో శక్తిమంతమైన క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ తీరంలో ప్రయోగించింది. ఈ పరీక్షలో క్షిపణి విజయవంతంగా టార్గెట్‌ను చేధించిందని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఈ క్షిపణి పరీక్షను నిర్వహించినట్టు చెప్పారు. ఈ ప్రయోగంలో క్షిపణి నేరుగా లక్ష్యాన్ని తాకి దానిని ధ్వంసం చేసిందని అధికారులు చెప్పారు. ''ఎంఆర్ఎస్ఏఎం ఆర్మీ క్షిపణి వ్యవస్థ విమానం ఐటీఆర్ బాలాసోర్‌లో దాదాపు 10.30 గంటల సమయంలో సుదూరం శ్రేణిలో ఉన్న హైస్పీడ్ ఏరియల్ లక్ష్యాన్ని ఛేదించింది'' అని డీఆర్డీఓ ట్వీట్ చేసింది. ఈ శక్తిమంతమైన క్షిపణిని కొన్నేండ్లుగా ఇండియా, ఇజ్రాయెల్‌కు చెందిన అధికారులు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎదురుగా వచ్చే విమానాలు, హెలికాప్టర్లు, మిస్సైళ్లను ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, లార్సెన్ అండ్ టూబ్రో, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌తో పాటు ఇజ్రాయెల్ రాఫెల్ అడ్వాన్స్డ్ ఢిఫెన్స్ సిస్టమ్స్ వంటి పలు కంపెనీలు భాగమయ్యాయి.