Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పునరావాస ప్రక్రియలో భాగంగా దాదాపు 20 వేల మంది వీధి బాలలను గుర్తించినట్టు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) తెలిపింది. పునరావాస ప్రక్రియలో కొనసాగుతున్నదని ఎన్సీపీసీఆర్ చైర్పర్సన్ ప్రియాంక్ కనూంగొ తెలిపారు. దేశంలోని వీధి బాలల పరిస్థితిపై మాట్లాడుతూ.. వీరి కోసం 'బాల్ స్వరాజ్' అనే వెబ్ పోర్టల్ ఏర్పాటైంది. ఇందులో వీధి బాలల సమాచారం పొందుపర్చబడి ఉంటుంది. దీంతో వారిని ట్రాక్ చేయొచ్చు. వారికి పునరావాసం కల్పించే వైపు పని చేయగలం. ఇప్పటి వరకు దాదాపు 20వేల మంది వీధి బాలలను గుర్తించినట్టు, వారు పునరావాసాన్ని పొందే ప్రక్రియలో ఉన్నారని ప్రయాంక్ కనూంగొ చెప్పారు. అయితే, ఈ విషయంలో రాష్ట్రాలు ప్రభావవంతంగా పని చేయడం లేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. '' మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు చక్కటి పనిని కనబర్చాయి. ఢిల్లీ, మహారాష్ట్ర లు మాత్రం వీధి బాలల కోసం ఏమీ చేయలేదు'' అని ఆయన అన్నారు. '' ఢిల్లీ వీధుల్లో దాదాపు 73వేల మంది బాలలు నివసిస్తున్నారని మాకు సమాచారమిచ్చారు. కానీ, ఢిల్లీ ప్రభుత్వ సక్రమంగా పనిచేయకపోవడంతో 1800 మంది చిన్నారులు మాత్రమే పునరావాస ప్రక్రియలోకి వచ్చారు'' అని చెప్పారు. ప్రస్తుతం భారత్లోని వీధుల్లో దాదాపు 15 నుంచి 20 లక్షల మంది చిన్నారులు నివసిస్తున్నట్టు ఆయన అంచనా వేశారు. కాగా, వీధి బాలల గుర్తింపు, పునరావాస ప్రక్రియకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తున్నది. దీనిపై తదుపరి విచారణను న్యాయస్థానం నేడు (సోమవారం) చేపట్టనున్నది.