Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరలివెళ్లిన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్
- గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ తరలింపు
- ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఆయూష్ మంత్రిత్వశాఖ ఒప్పందం
- ఏప్రిల్ 21న ప్రధాని చేతులమీదుగా ప్రారంభం
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ తెలంగాణకు షాక్ ఇచ్చింది. 'సంప్రదాయ వైద్య కేంద్రాన్ని' గుజరాత్‌లోని జామ్ నగర్‌కు తీసుకెళ్లింది. సాంప్రదాయ ఔషధం అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వివిధ దేశాల్లో 'గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్' కేంద్రాల్ని ఏర్పాటుచేయడానికి నడుం బిగించింది. ఈనేపథ్యంలో ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్నదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గతంలో ప్రకటించారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు..వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ గుజరాత్‌కు తరలివెళ్లింది. శుక్రవారం అర్థరాత్రి జెనీవాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కొటేచా, డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సంతకం చేశారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏప్రిల్ 21న ప్రధాని మోడీ చేతులమీదుగా భూమి పూజ కార్యక్రమంతో వైద్య కేంద్రానికి ప్రారంభోత్సవం జరగనున్నది. ఒప్పందం ప్రకారం..వైద్య కేంద్రం కోసం డబ్ల్యూహెచ్‌వో గుజరాత్లో 250 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.1907కోట్లు) పెట్టుబడి పెట్టనున్నది. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాల్ని ప్రపంచవ్యాప్తంగా స్థాపించాలని డబ్ల్యూహెచ్‌వో లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు గత నెలలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అయితే ప్రాజెక్ట్ హైదరాబాద్‌కు వస్తుందని అందరూ భావించగా, కొద్ది వారాల్లో కీలక మార్పు చోటుచేసుకోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకిలా మారింది? హైదరాబాదులో సంప్రదాయ వైద్య కేంద్రం ఏర్పాటుకు స్థలం గుర్తించాలని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. భారత్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటుకు డబ్ల్యూహెచ్‌వో ముందుకొచ్చిందనీ, కేంద్ర ఆయుష్ శాఖ కూడా హైదరాబాద్ వైపు చూస్తోందని ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ కేంద్రం ఏర్పాటు కోసం సుమారు 40 నుంచి 50 ఎకరాల భూమి అవసరమవుతుందని పేర్కొన్నారు. అవసరమైన భూమిని తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా గుర్తించాలని కిషన్‌రెడ్డి తన లేఖలో కోరారు. సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే..సీన్ మారిపోయింది. ప్రాజెక్ట్‌ను కేంద్రంలోని బీజేపీ పెద్దలు గుజరాత్‌కు తరలించారు.