Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు, రేపు 48 గంటల దేశవ్యాప్త సమ్మె
- దేశాన్ని, ప్రజలను
- కాపాడుకుందాం పిడికిలి బిగించిన కార్మిక, కర్షకలోకం, ఉద్యోగులు
- మోడీ సర్కార్ ఆర్థిక విధానాలతోనే దేశంలో నేడు ఈ పరిస్థితి
- నిరుద్యోగం, ధరల పోటుతో సామాన్యుడి బతుకు కకావికలం : రాజకీయ విశ్లేషకులు
- ప్రజల నిరసన గళాన్ని..ప్రధాని మోడీ వినాలి..
ధరల పోటు, నిరుద్యోగం, ఎక్కడ చూసినా అభద్రత...ఒక్కటి కాదు అనేక సమస్యలు దేశ ప్రజల్ని చుట్టుముట్టాయి. గత 8ఏండ్లుగా మోడీ సర్కార్ ఆర్థిక, పాలనాపరమైన విధానాల ఫలితమే ఇదంతా. కాబట్టి సమస్యను, సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మోడీ సర్కార్పైన్నే ఉందని కార్మిక, కర్షక లోకం, ఉద్యోగులు నినదిస్తున్నారు. అత్యంత ధనవంతులు, బడా కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు కొనసాగాయి కాబట్టే..నేడు సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఆగాలంటే కేంద్ర ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు రావాలని కార్మిక, కర్షక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ప్రజా ఆందోళన మరింత ఉధృతం అవుతుందనే హెచ్చరిక నేటి సమ్మె ద్వారా తెలియజేస్తున్నాయి.
న్యూఢిల్లీ : నేడు దేశంలో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు..ఎవ్వరూ సంతోషంగా లేరు. తమ బతుకేదో తాము బతుకుదామన్నా..మోడీ సర్కార్ అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆర్థికంగా ఎదరవుతున్న విపత్కర పరిస్థితుల నుంచి ఉపశమనం ఎప్పుడు లభిస్తుందా? అని కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. మోడీ సర్కార్ ఆర్థిక విధానంలో సమూల మార్పుల వస్తే తప్ప..పరిస్థతి చక్కబడదని దేశ ప్రజలంతా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో కార్మిక, కర్షక సంఘాలు నేడు, రేపు (మార్చి 28-29) 48 గంటలపాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈసమ్మెలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, యువత, కళాకారులు, మేధావులు, శాస్త్రవేత్తలు...ఇలా అనేక వర్గాలు పాల్గొంటున్నాయి. 'దేశాన్ని..ప్రజల్ని కాపాడుకుందాం'..అనే నినాదంతో మందుకు కదులుతున్నాయి. చరిత్రాత్మకమైన ఈ సమ్మెలో దాదాపు 25కోట్లమంది కార్మికులు పాల్గొంటారని ఒక అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం రైతాంగమంతా సామూహిక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తయారీరంగం, బ్యాంకింగ్, ఆర్థిక సేవా సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా, నిర్మాణం, ఓడరేవులు...మొదలైన రంగాలన్నీ సమ్మెలో పాలుపంచుకుంటున్నాయి. దాంతో ఈ రంగాల్లో రెండు రోజుల పాటు కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి.
అమృతకాలం..ఎట్లా?
బ్రిటీష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75ఏండ్లు అయిన సందర్భంగా మోడీ సర్కార్, బీజేపీ నాయకులు గొప్ప గొప్ప మాటలతో దేశ ప్రజల్ని ఊరడిస్తున్నారు. దేశంలో 'అమృత కాలం' మొదలైందని పాలకులు ప్రచారం చేసుకుంటున్నారు. కుటుంబ ఆదాయం కోల్పోయి కోట్లాది మంది రోడ్డున పడుతుంటే, నిరుద్యోగం రికార్డ్‌స్థాయికి చేరుకొంటే, అధిక ధరలతో సామాన్యుడు వణికిపోతుంటే..'అమృత కాలం' ఎలా అవుతుంది? అని కార్మిక, కర్షక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మోడీ సర్కార్ ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తుందోనని.. ప్రభుత్వరంగ ఉద్యోగులు, బ్యాంకింగ్ ఉద్యోగులు హడలిపోతున్నారు. అనేక రంగాల్ని అభద్రత ఆవహించింది. దేశంలో అక్రమాలు, దోపిడి పతాకస్థాయికి పెరిగిపోయాయి. వీటిని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న పేదలు, మధ్యతరగతికి మోడీ సర్కార్ పాలన 'అమృతకాలం' ఎలా అవుతుందో అర్థం కావటం లేదు.
కార్మిక సంఘాల డిమాండ్లు...
- 12 అంశాల డిమాండ్‌తో కార్మికులు, కర్షకులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. కోవిడ్ సంక్షోభం కారణంగా కష్టపడుతున్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం వంటి కొత్త సమస్యలను డిమాండ్ చార్టర్ చేర్చింది.
- నాలుగు లేబర్ కోడ్లు, ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ యాక్ట్ (ఈడీఎస్ఏ)ని రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత, పెండింగ్‌లో ఉన్న ఇతర డిమాండ్ల కోసం తాము పోరాటం కొనసాగిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి.
- వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైల్వేలు, పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌లు, టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను తెగనమ్మటాన్ని ఆపేయాలి.
- ప్రయివేటీకరణ వల్ల కార్పొరేట్లకు లాభాలు తప్ప మరో ప్రయోజనం లేదు. ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పోతాయి, రిజర్వేషన్లు ముగుస్తాయి. కనుక ప్రైవేటీకరణ ఆపాలని, 'జాతీయ నగదీకరణ విధానాన్ని' రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలందరికీ నెలకు రూ.7500 ఆదాయ మద్దతును అందించాలి
- కొన్ని ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వడం సరిపోదు. అందువల్ల ఆర్థిక సహాయం కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
- ఉపాధి హామీకి కేటాయింపులను పెంచాలి. పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ విస్తరించాలి
- అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రతను అందించాలి.
- అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఇతర స్కీమ్ వర్కర్లకు చట్టబద్ధమైన కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలిక.
- 60 లక్షలకు పైగా 'స్కీమ్ వర్కర్లు' ప్రధానంగా మహిళలు ఉన్నారు. వీరు వివిధ ప్రభుత్వ పథకాలలో ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ సేవలు, పిల్లల సంరక్షణ సేవలు మొదలైన కీలకమైన ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని రెగ్యులరైజ్ చేసి అన్ని చట్టబద్ధమైన హక్కులతో కూడిన కార్మికులుగా పరిగణించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, సామాజికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
- లక్షలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పారా మెడికల్, సహాయక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి.
- వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఇతర కీలకమైన ప్రజా సేవలలో ప్రభుత్వ పెట్టుబడిని పెంచాలి.
- పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని గణనీయంగా తగ్గించి, ధరల పెరుగుదలను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలి.
- ప్రజా పంపిణీ వ్యవస్థ సార్వత్రికీకరణ, సబ్సిడీల పునరుద్ధరణ, ఎక్సైజ్ సుంకాల కోత చేపట్టాలి.
- కాంట్రాక్ట్ కార్మికులు, స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
- కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)ని రద్దు చేయాలి. పాత పథకాన్ని పునరుద్ధరించాలి. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్‌ను పెంచాలి.