Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజూ ఉధృతంగా సాగుతుంది..
న్యూఢిల్లీ : దేశవ్యాప్త సమ్మెకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, మొదటి రోజు సమ్మెను సక్సెస్ చేసినందుకు కార్మికలోకానికి 'సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్' (సీఐటీయూ) కృతజ్ఞతలు తెలియజేసింది. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29 రెండు రోజులపాటు కార్మిక, కర్షక సంఘాలు, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు దిగాయి. సోమవారం మొదటిరోజు సమ్మెలో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈమేరకు సీఐటీయూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. కేరళ, త్రిపుర, హర్యానా, పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడులోని అనేక జిల్లాల్లో పూర్తిస్తాయి బంద్ పాటించారు. ప్రయివేటు, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. అనేక చోట్ల రోడ్డు, రైల్ రోకోలు చేపట్టారు. పరిశ్రమలు, వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, వివిధ రకాల కార్యాలయాలు...అన్నీ బంద్ పాటించాయి. దేశవ్యాప్తంగా పారిశ్రామిక వాడలు, హబ్‌లు సమ్మెలో పాల్గొన్నాయి. ఎస్మా ప్రయోగి స్తామని, వేతనాల్లో కోతపెడతామని పాలకులు, యాజమాన్యాలు భయపెట్టినా కార్మికులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు. దేశాన్ని...దేశ ప్రజల్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం నాటికి అందిన సమాచారం ప్రకారం, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ, కర్నాటక, హర్యానా రాష్ట్రాల్లో సమ్మె ఉధృతంగా సాగింది. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణిలో, కేరళలో, తమిళనాడులో, కర్నాటక, పాండిచ్చెరీలో, ఈశాన్య రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో సమ్మె 100శాతం జరిగింది. బీమా, బ్యాంకింగ్, తపాలా, ఆదాయ పన్ను విభాగాల్లో సమ్మెకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో అనేక చోట్ల బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేశారు. రెండో రోజూ సమ్మె మరింత ఉధృతంగా సాగుతుంది. దేశాన్ని, దేశ ప్రజల్ని కాపాడుకునే క్రమంలో కార్మిక లోకం రెండోరోజూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఐటీయూ పిలుపునిచ్చింది.