Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక హోంమంత్రి ఆదేశాలు
న్యూఢిల్లీ : కర్నాటకలో హిజాబ్ వివాదాన్ని మరింతగా పెద్దది చేయాలన్న తలంపుతో అక్కడి బీజేపీ సర్కార్ అడుగులు వేస్తోంది. హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరైతే..వారిని పరీక్ష గదిలోకి అనుమతించమని కర్నాటక హోంమంత్రి జ్ఞానేంద్ర ఆదేశాలు జారీచేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులను పెద్ద ఎత్తున మోహరిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ముస్లిం విద్యార్థులు పరీక్షలను బారుకాట్ చేస్తామని ప్రకటించారు. దాంతో ఈ వివాదం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి (ఎస్ఎస్ఎల్సీ) పరీక్షలు ప్రారంభ మయ్యాయి. ఈనేపథ్యంలో హిజాబ్ వివాదం విద్యార్థులు, వారి తల్లిదం డ్రుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర హోంమంత్రి జ్ఞానేంద్ర కీలక ప్రకటన చేశారు. ''రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం హిజాబ్ ధరించి విద్యార్థులెవ్వరూ పరీక్షలకు రాకూడదు. ఒకవేళ అలా ఎవరైనా వస్తే హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించినట్టే. ఆదేశాలు పాటించనివారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వుంటుంది. ఈ విషయంలో మేం రాజీపడే ఉద్దేశం లేదు. హిజాబ్ తొలగించే పరీక్షలకు హాజరుకావాలి'' అని అన్నారు. ఈ విషయమై..ప్రాథమిక, ఉన్నత విద్యాశాఖ మంత్రి బి.సి.నాగేశ్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. ''ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘిస్తే పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఈ విధమైన పరిస్థితి ఏర్పడదని అనుకుంటున్నా. కఠినంగా వ్యవహరించే అవకాశం విద్యార్థులెవ్వరూ రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించరని భావిస్తున్నా. ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాలని కోరుతున్నా''నని అన్నారు. అన్ని మతాలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలని, మనసులోని భావాల్ని పక్కకు పెట్టాలని మాజీ సీఎం హెచ్డి.కుమార్స్వామి అన్నారు.