Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సార్వత్రిక సమ్మె తొలి రోజు సక్సెస్
- దేశవ్యాప్తంగా భారీ స్పందన
- సమ్మెలోకి పది కోట్ల మంది కార్మికులు
- సంఘీభావం ప్రకటించిన డబ్ల్యూఎఫ్‌టీయూ
మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ వినాశకర, ప్రజా వ్యతిరేక, జాతీయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికలోకం సమ్మె సమరశంఖం పూరించింది. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగ సమాఖ్యలు, సంఘాల సంయుక్త వేదికలు పిలుపునిచ్చిన రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో తొలిరోజు విజయవంతమైంది. 'ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మనీయం...దేశాన్ని కాపాడుకుంటాం.. ప్రజల్ని రక్షించుకుంటాం... కార్మిక కోడ్లను తిప్పికొడతాం...సంఘం పెట్టుకుని తీరుతాం' అంటూ గర్జించింది. దేశవ్యాప్త ప్రదర్శనల్లో కోట్లాది మంది భాగస్వామ్యమయ్యారు. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, బ్యాంకులు, ఇన్సూరెన్స్ వంటి వివిధ రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు తమ సంస్థలను రక్షించుకునేందుకు కలిసికట్టుగా ముందుకు కదిలారు. ఈ చారిత్రాత్మక సమ్మె పిలుపు కేవలం కార్మికుల తక్షణ డిమాండ్లే కాకుండా కేంద్ర ప్రభుత్వ దేశ వ్యతిరేక విధ్వంసక విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపు అని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ స్పష్టం చేశారు. సార్వత్రిక సమ్మెకు ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌టీయూ) సంఘీభావం తెలిపింది.
న్యూఢిల్లీ : కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో శ్రామిక లోకం కదం తొక్కింది. సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ, స్వతంత్ర సంఘాలు, ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన లభించింది. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, బ్యాంకులు, ఇన్సూరెన్స్ వంటి వివిధ రంగాలకు చెందిన యూనియన్లు సమ్మెలో పాల్గొన్నాయి. రైల్వే, రక్షణ రంగంలోని యూనియన్లు వందల ప్రదేశాలలో సమ్మెకు మద్దతుగా భారీ సమీకరణచేశాయి. సెయిల్, ఆర్ఐఎన్ఎల్, ఎన్ఎండీఏసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎన్ఎండీసీ గనులు, కార్యాల యాల కార్మికులు సమ్మెలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బచేలి, కర్నాటకలోని దోనిమలై వంటి ముఖ్యమైన మైనింగ్ కాంప్లెక్స్‌ల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్‌ఐఎన్‌ఎల్‌తో పాటు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కార్మికులు కూడా నిరసనలో పాల్గొన్నారని స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్డబ్ల్యుఎఫ్ఐ) తెలిపింది. బొగ్గు కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో చేరారు. పొడి-ఇంధన ఉత్పత్తి దెబ్బతింది. ఈ సార్వత్రిక సమ్మె అనేక రాష్ట్రాలలో బంద్‌గా మారింది. ప్రత్యేకించి కేరళ, త్రిపుర, తమిళనాడు, హర్యానా, పశ్చిమ బెంగాల్, అసోంలోని అనేక జిల్లాల్లో ప్రభుత్వ, ప్రయివేట్ ప్రజా రవాణా నిలిచిపోయింది. వేలాది మంది ప్రజలు అనేక చోట్ల రోడ్డు, రైలు దిగ్బంధనాల్లో పాల్గొన్నారు. ఫ్యాక్టరీలు, దుకాణాలు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు నిర్మానుష్యంగా మారాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలు, హబ్‌లలో సమ్మె భారీగా జరిగింది. ఎస్మా, ఎనిమిది రోజుల వేతన కోత నోటీసులు మొదలైన బెదిరింపులు ఉన్నప్పటికీ, దేశాన్ని, ప్రజలను రక్షించడానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపుకు శ్రామిక ప్రజలు భారీగా స్పందించారు.
మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ, కర్నాటక, హర్యానాలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలలో సమ్మె భారీ స్థాయిలో జరిగింది. టుటికోరిన్ వోక్ పోర్ట్, పారాదీప్ పోర్ట్ల్లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. సమ్మె కారణంగా వైజాగ్ స్టీల్, తిరుచ్చి, రాణిపేటలోని బీహెచ్ఈఎల్ యూనిట్లు పూర్తిగా స్తంభించాయి. బొగ్గు గనుల రంగంలో సమ్మె సగటున 60 శాతం కంటే ఎక్కువగా జరిగింది. తెలంగాణలోని సింగరేణి కాలరీస్ దాదాపు 100 శాతం సమ్మె జరిగింది. పవర్ గ్రిడ్‌లో సమ్మె అపూర్వంగా జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి, ఈశాన్య ప్రాంతంలో ఏడు రాష్ట్రాలు అసోం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, తూర్పు ప్రాంతంలో ఒరిస్సా, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ల్లో 100 శాతం సమ్మె జరిగింది. ఆయిల్, రిఫైనరీ రంగం, ఎల్పిజి ప్లాంట్లు అస్సాంతో పాటు అన్ని ఈశాన్య రాష్ట్రాలలోనూ, కొచ్చి, మంగళూరులో కూడా భారీ సమ్మె జరిగింది.
బ్యాంకు, బీమా, పోస్టల్, టెలికాం సంస్థల్లో...
బ్యాంకు, బీమా సంస్థల్లో సమ్మె పూర్తిగా జరిగింది. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి పోస్టల్, ఆదాయపన్ను, ఇతర ప్రధాన శాఖల్లో జరిగిన సమ్మెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు. ఉక్కు, చమురు రంగాలపై పాక్షిక ప్రభావం కనిపించింది.
పారిశ్రామిక వాడల్లో..
బెంగళూరు ఇండిస్టియల్ ఏరియాలోని బొమ్మసంద్ర, బిడపి, పీనియన్, వైట్‌ఫీల్డ్, హౌస్కోటే, దాబస్‌పేట్ ఇండిస్టియల్ ఏరియా (కర్నాటక)లోని ప్రయివేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో సమ్మె సంపూర్ణంగా జరిగింది.
అదేవిధంగా హైదరాబాద్ సమీపంలోని చెర్లపల్లి పారిశ్రామిక వాడను పూర్తిగా మూసివేశారు. తెలంగాణలోని శాండ్విక్, తోషిబా వంటి ఎంఎన్‌సీలు కూడా పూర్తి సమ్మెను చూశాయి. చెంగల్పట్టు, కాంచీపురం సహా తమిళనాడులోని పారిశ్రామిక ప్రాంతాలలో కూడా సమ్మె దాదాపు సంపూర్ణంగా జరిగింది. ప్రజా రవాణా, ఆటో, టాక్సీ, ఓలా, ఉబర్‌తో సహా రోడ్డు రవాణా అనేక రాష్ట్రాల్లో నడవలేదు.
కోల్ ఫీల్డ్స్‌లో..
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యుసీఎల్)లోని నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్)లో సమ్మె కొన్ని ప్రాంతాల్లో విజయవంతమైంది. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసిఎల్)లో కూడా సమ్మె విజయవంతమైంది. రైళ్ల రాకపోకలను సైతం కార్మికులు అడ్డుకున్నారు. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) సమ్మె విజయవంతం అయింది. సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్)లో రెండు మినహా మిగిలిన 13 ఏరియాల్లో కార్మికులు సమ్మెకు దిగారు. బొగ్గు ఉత్పత్తి, పంపకం స్తంభించిపోయింది.
రవాణా ఉద్యోగులు..
రోడ్డు రవాణ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడంతో హర్యానాలో ప్రజా రవాణా సేవలు దెబ్బతిన్నాయి. హర్యానా రోడ్‌వేస్‌లోని పలు డిపోల్లో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు డిపోల వద్ద రోడ్‌వేస్ ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, మునిసిపల్ బాడీలతో సహా మరికొన్ని శాఖల ఉద్యోగులు, కార్మికులు కూడా దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారు. తమిళనాడులో ఎంటిఎస్ బస్సులు నిలిపివేశారు. పశ్చిమ బెంగాల్లో జనజీవనం స్తంభించింది. హౌరా, సీల్దా సెక్షన్లలోని కొన్ని రైల్వే స్టేషన్లలో కార్మిక సంఘాలు రోడ్లను దిగ్బంధించడం, రైలు కదలికలను నిలిపివేయడంతో కొన్ని జిల్లాల్లో రవాణా సేవలు నిలిచిపోయాయి.
అసంఘటిత రంగ కార్మికులు
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హర్యానా రాష్ట్రాల్లోని పవర్లూమ్, స్పిన్నింగ్ మిల్లు కార్మికులు దాదాపు పూర్తిగా సమ్మెలో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, హెడ్ లోడ్ కార్మికులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు సహా కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులతో సహా దాదాపు 80 లక్షల మంది స్కీమ్ వర్కర్లు సంబంధిత రంగాల్లో సమ్మె చేయడంలో ముందంజలో ఉన్నారు. షాపు ఉద్యోగులు, తోటలతోపాటు సంప్రదాయ రంగ కార్మికులు, కొబ్బరి కార్మికులు తదితరులు సమ్మెలో పెద్దఎత్తున పాల్గొన్నారు. వివిధ ప్రజా సంఘాల సభ్యులతో పాటు రైతులు, వ్యవసాయ కార్మికులు కూడా ఆ దిగ్బంధన ప్రదర్శనలలో పాల్గొన్నారు. పలు రాష్ట్రాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు గ్రామీణ హర్తాళ్‌ను పాటించారు.
రెండో రోజు మరింత భారీగా రెండో రోజు సమ్మె మరింత భారీగా జరుగుతుందని తాము భావిస్తున్నామనిసీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ అన్నారు. కార్మికవర్గం వారి ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తూ రెండో రోజు సమ్మెను మరింత భారీగా నిర్వహించాలని సీఐటీయూ పిలుపునిచ్చిందని తెలిపారు. బొగ్గు కార్మికుల సమ్మెలో ఇప్పటి వరకు 60 శాతానికిపైగా పాల్గొన్నారని, కొన్ని కొలిరీస్లు పూర్తిగా మూతపడ్డాయని తెలిపారు. ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ మాట్లాడుతూ సమ్మె కారణంగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో మొత్తం కోల్ బెల్ట్ (మైనింగ్ ప్రాంతం) ప్రభావితమైందని అన్నారు. అసోం, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటక, బీహార్, పంజాబ్, రాజస్థాన్, గోవా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలోని పారిశ్రామిక ప్రాంతాలలో కూడా మంచి స్పందన వస్తోందని ఆమె అన్నారు.
- సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్