Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
- జంతర్ మంతర్లో బీసీ సంక్షేమ సంఘం ధర్నా
- బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే కేంద్ర మంత్రులను తిరగనివ్వం: ఆర్.కృష్ణయ్య
న్యూఢిల్లీ : పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టసభల్లో (అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో) బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం నాడిక్కడ జంతర్ మంతర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ''మా ఓట్లు...మా సీట్లు, రాజ్యాధికారంలో వాటా కావాలి, బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించాలి, మోడీ సర్కార్ ముర్దాబాద్'' అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టకపోతే కేంద్ర మంత్రులను దేశంలో తిరగనివ్వమని హెచ్చరించారు. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకుని బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చేది బిక్షం కాదనీ, రాజ్యాంగ బద్ధమైన హక్కని స్పష్టం చేశారు.
దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు, మానవ హక్కులు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అణచి వేస్తుందన్నారు. బీసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఎలాంటి పథకాలు, రాయితీలు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బీసీ జనాభా 56 శాతం ఉంటే, 27 శాతం రిజర్వేషన్లు పెట్టారని అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారని ధ్వజమెత్తారు. బడ్జెట్ కేటాయించటం లేదని, రూ. 36.45 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు బిచ్చమేసినట్లు రూ.1,400 కోట్లు కేటాయిస్తారా? అని ప్రశ్నించారు.
ఈ బడ్జెట్తో దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు బిస్కెట్లు కూడా రావన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లోనూ, ప్రయివేటు రంగంలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టకుండా అణచి వేస్తున్నారని విమర్శించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇంతవరకు ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని అన్నారు. కుల గణన చేయాలని కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని విమర్శించారు. రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 37 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేశారని అన్నారు.బీసీ ఉద్యోగులకు పదోన్నతల్లో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర స్థాయిలో బీసీలకు స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన బీసీ నేతలు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, నీల వెంకటేష్, జి. అనంతయ్య, భుపేష్ సాగర్, వేముల రామకృష్ణ, బి.సి. వెంకట్, జక్కుల వంశీ కృష్ణ, జక్కని సంజరు, ఉదరు, అరవింద్, లింగయ్య యాదవ్, రామూర్తి తదితరులు పాల్గొన్నారు.