Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక డిమాండ్లపై చర్చించాల్సిన బాధ్యత పార్లమెంట్‌కు ఉంది: సార్వత్రిక సమ్మెపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : కార్మికుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం అహంకారం వదలి, సానుకూలంగా స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రెండో రోజు కూడా పార్లమెంట్లో వామపక్ష ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కార్మిక డిమాండ్లతో కూడిన ప్లకార్డు పట్టుకొని నినాదాల హౌరెత్తించారు. అలాగే పార్లమెంట్ నుంచి విజరు చౌక్‌కు మార్చ్ నిర్వహించారు. మరోపై కార్మిక సంఘాలు లేవనెత్తిన 12 పాయింట్స్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌పై చర్చించాలని సీపీఐ(ఎం) ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి.శివదాసన్, సీపీఐ ఎంపీ బినరు విశ్వం, కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హా గోయల్ 267 రూల్ కింద నోటీసులు ఇచ్చారు. వీటిని చైర్మెన్ ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించారు. ఈ సందర్భంగా సభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ ''దేశం మొత్తం సమ్మెలో ఉంది. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల లేవనెత్తిన డిమాండ్లపై సభ చర్చిస్తుందని మేం ఆశిస్తున్నాం. ప్రజల జీవితాలు, జీవనోపాధి చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం'' అని అన్నారు. జాన్ బ్రిట్టాస్ లేవనెత్తిన సమస్యలపై తాను అసోసియేట్ అవుతానని బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్ తెలిపారు. సీపీఐ ఎంపీ బినరు విశ్వం మాట్లాడుతూ ''కార్మిక సమ్మెకు పార్లమెంట్ బాధ్యత వహిస్తుందనుకుంటున్నాను. సమ్మె చేస్తున్న కార్మిక వర్గం దేశ సంపద సృష్టి కర్తలు. దేశం కోసం రక్తం చిందిస్తున్నవారు సమ్మె చేస్తున్నారు. కనుక వారి డిమాండ్లపై చర్చించాల్సిన బాధ్యత సభకు ఉంది. ప్రభుత్వం చర్చకు సమయం కేటాయించి, చర్చకు ముందుకు రావాలి'' అని సూచించారు. కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హా గోయల్ మాట్లాడుతూ ''దేశంలోని కార్మిక వర్గం అంతా సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రెండు రోజుల పాటు సమ్మె చేస్తున్నారు. లేబర్ కోడ్లను రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలి, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ రద్దు, ఉపాధి హామీకి నిధులు కేటాయించాలి వంటి ప్రధాన డిమాండ్లపై సమ్మె జరుగుతుంది.
కార్మిక డిమాండ్లపై ప్రభుత్వం అహంకారం వదిలి, సానుకూలంగా స్పందించాలి'' అని కోరారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ ''కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ లిస్టులో పెట్టలేదు. కనీసం బుధవారం అయినా లిస్టులో పెట్టాలి'' అని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రయివేటీకరణ విధానాలపై చర్చించాలని, కార్మిక సంఘాల సమ్మెపై ప్రభుత్వం స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల చేపడుతున్న రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు మంగళవారం ప్రతిపక్ష సభ్యులు మద్దతు ప్రకటించారు. ఈ అంశంపై లోక్‌సభలో చర్చకు కోరారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన తృణమూల్ సభ్యుడు సౌగతా రారు సమ్మెకు భారీ స్పందన లభించిందని, ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల అసంతృప్తిని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ''అన్నింటిని అమ్మేస్తున్న విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి'' అని అన్నారు. సభలో ఈ అంశంపై చర్చ జరగాలని కోరారు. లోక్‌సభలో సీఏ సవరణ బిల్లును కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ప్రవేశపెట్టారు.