Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజూ సమ్మె విజయవంతం
- దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది భాగస్వామ్యం
- దాదాపు 80 దేశాల్లోని భారతీయ నావికుల సంఘీభావం
- అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రత్యేక కథనాలు
- ప్రపంచ కార్మిక సంఘాల మద్దతు
- కార్పొరేట్, మతోన్మాద పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రజలు కంకణబద్ధులయ్యారు : సీఐటీయూ
కేంద్రంలోని మోడీ సర్కార్ కార్మిక, రైతు, ప్రజా, దేశ వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని కార్పొరేట్, మతోన్మాద పాలన నుంచి దేశాన్ని రక్షించుకోవాలని నిర్ణయించుకుంది. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా, దేశ పరిరక్షణకు సంబంధించిన 12 డిమాండ్లతో రెండు రోజుల పాటు జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో రెండో రోజు సమ్మె జరిగింది. ఎస్మా, బెదిరింపులు, అన్నిరకాల అడ్డంకులను ఎదుర్కొని సమ్మెలో పాల్గొనేవారి సంఖ్య 20 కోట్లు దాటింది. దాదాపు 80 దేశాల్లోని భారతీయ నావికులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. అలాగే ప్రపంచ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. దేశంలో జరుగుతున్న సమ్మెపై అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ఇచ్చాయి. ఈ సమ్మెను విజయవంతం చేసినందుకు కార్మిక వర్గానికి, దేశ ప్రజలకు సీఐటీయూ అభినందనలు తెలిపింది.
న్యూఢిల్లీ : 2020 నవంబర్‌లో అంతకుముందు జరిగిన సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న వారి కంటే ఎక్కువ మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. అన్ని రంగాల కార్మికుల నుంచి అపారమైన స్పందన లభించింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం యజమానులు, ప్రభుత్వాల నుంచి బెదిరింపులు ఉన్నప్పటికీ, ఇది దేశ చరిత్రలో అతిపెద్ద సమ్మెల్లో ఒకటిగా నిలిచింది. కార్మికులు, ఉద్యోగులు ఈ బెదిరింపులను పక్కనబెట్టి సమ్మెలో పాల్గొన్నారు. కొచ్చిన్ రిఫైనరీ కార్మికులు, కేరళలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన చట్టవిరుద్ధమైన ఆదేశాలను పట్టించుకోలేదు. రెండో రోజూ సమ్మెను కొనసాగించారు. రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు మన దేశ ప్రజల నుంచి మాత్రమే కాకుండా అంతర్జాతీయ మద్దతు, సంఘీభావం లభించింది. ఇది అంతర్జాతీయంగా దృష్టిని అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమం నుంచి సంఘీభావాన్ని పొందింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్‌తో పాటు పలు కార్మిక సంఘాలు తమ సంఘీభావాన్ని తెలిపాయి. ప్రస్తుతం ఖండాలు, మహాసముద్రాల్లో వివిధ దేశాల్లో ఉన్న భారతీయ నావికులు తమ సంఘీభావాన్ని తెలిపారు.
రోడ్లు, రైలు దిగ్బంధనాలు...
రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు భారీ స్పందన లభించింది. ఆర్థిక వ్యవస్థలోని వ్యూహాత్మక రంగాలైన విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, హైడల్ ప్రాజెక్టులు, పవర్‌గ్రిడ్, రోడ్డు రవాణాతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, అసోం, హర్యానా, ఎన్సీఆర్ (ఢిల్లీ) ప్రాంతంలోని బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్సీ)లతో సహా ప్రయివేట్ రంగంలో ఆధునిక పారిశ్రామిక యూనిట్లు మూతపడ్డాయి. బ్యాంకులు, బీమా కంపెనీల్లోని కార్మికులు, ఉద్యోగులు దేశంలో ఎక్కడా తమ పని ప్రదేశాల్లోకి ప్రవేశించలేదు. పోస్టల్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ తదితర విభాగాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్దఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. వైజాగ్ స్టీల్, ఆయిల్, ఎల్పీజీ ప్లాంట్లు, కాపర్, టెలికాం సెక్టార్, సిమెంట్ రంగ కార్మికులు మార్చి 28 ఉదయం నుంచి పెద్దఎత్తున సమ్మె చేశారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కార్మికులు సమ్మెకు దిగారు. ట్యుటికోరిన్, పారాదీప్‌లోని ఓడరేవు కార్మికులు కూడా పనిచేశారు. రైల్వే, రక్షణ శాఖ ఉద్యోగులు దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. జ్యూట్, ప్లాంటేషన్ రంగాలలోనూ సమ్మె పిలుపుకు భారీ స్పందన కనిపించింది. మత్స్యకారులు కూడా ఉదయం సముద్రంలోకి వెళ్లలేదు. అసంఘటిత రంగంలోని నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, వీధి వ్యాపారులు మొదలైనవారు సమ్మెలో పాల్గొనడమే కాకుండా దేశంలోని వేలాది ప్రదేశాలలో రోడ్ల దిగ్బంధనం, రైలు దిగ్బంధన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లతో సహా దాదాపు 80 లక్షల మంది స్కీమ్ వర్కర్లు ఆయా రంగాల్లో సమ్మెను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సార్వత్రిక సమ్మె కారణంగా కేరళ, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, అసోంలోని అనేక జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేట్ ప్రజా రవాణా నిలిచిపోవడంతో బంద్ వంటి పరిస్థితి ఏర్పడింది.
పారిశ్రామిక వాడల్లో...
గోవా, కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పారిశ్రామిక ప్రాంతాలలో సమ్మె గణనీయంగా ఉంది. సిక్కింలో కూడా భద్రతా కార్మికులు సమ్మెకు దిగారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్‌లో పారిశ్రామిక ప్రాంతాలు సమ్మెలో ఉన్నాయి. తమిళనాడులో 300 చోట్ల 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను పికెట్ చేశారు.