Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండు రోజులపాటు జరిగిన సమ్మె విజయవంతమైందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తెలిపింది. సమ్మెను విజయవంతంగా నిర్వహించిన కార్మికవర్గానికి అభినందనలు తెలియజేసింది. మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28, 29 రెండు రోజులపాటు కార్మిక, కర్షక సంఘాలు, ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు దిగాయి. పది కేంద్ర కార్మకసంఘాలు, వివిధ రంగాల్లోని ఫెడరేషన్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈనేపథ్యంలో దేశవ్యాప్త సమ్మె జరిగిన తీరుపై మంగళవారం సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఏముందంటే.. మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం, కేరళలో సమ్మె సందర్భంగా ప్రజలు బంద్ పూర్తిస్థాయిలో పాటించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, కర్నాటక, అసోం, త్రిపుర తదితర రాష్ట్రాల్లో ప్రధానమైన పరిశ్రమలపై సమ్మె పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. బీమా, బ్యాంకింగ్ రంగాల్లోని ఉద్యోగులు సమ్మెలో పూర్తిస్థాయిలో పాల్గొన్నారు. రవాణా, విద్యుత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్కీం వర్కర్స్ పెద్ద సంఖ్యలో ఈ బంద్‌లో పాల్గొన్నారు. బీజేపీ సర్కార్ విధానాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేది ఈ సమ్మె నిరూపించింది. జాతీయ సంపద, వనరుల్ని ప్రైవేటీకరించటాన్ని, ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మేయటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లేబర్ కోడ్స్, అధిక ధరలపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికులు ఈ సమ్మెలో చురుకుగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తమ ఆందోళనను తెలియజేశారు. నిరసనల్ని అణచివేయడానికి పలు రాష్ట్రాల్లో పోలీస్ బలప్రయోగం జరిగింది. దీనిని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండిస్తోంది. కార్మికుల డిమాండ్లను పాలకులు నెరవేర్చాలి. కార్మిక వ్యతిరేక విధానాలు అమలుజేస్తున్న మోడీ సర్కార్‌కు ఈ సమ్మె ఒక హెచ్చరికలాంటిదని పొలిట్‌బ్యూరో పేర్కొన్నది.