Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోవులను దొంగతనం చేశాడన్న నెపంతో ముస్లిం వ్యక్తిపై దారుణం..
అగర్తల : దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మూకదాడులు ఆగడం లేదు. త్రిపురలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకున్నది. ఆవులను దొంగిలించాడన్న నెపంతో ఒక ముస్లిం వ్యక్తి కొందరు దాడికి దిగారు. ఈ ఘటనలో బాదితుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు, బాదితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బాదితుడు లితన్ మియా ధన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తారాపుకర్ గ్రామవాసి. అయితే, ఆవులను దొంగిలించాడని అనుమానించిన గ్రామస్థులు కొందరు లితన్ మియాను పట్టుకున్నారు. ఆయనపై దాడి చేశారు. దీంతో లితన్ మియాకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాదితుడిని అగర్తలలోని ఒక ఆస్పత్రికి తరలించారు. అయితే, దారి మధ్యలోనే లితన్ మియా చనిపోయాడు. ఆవులను దొంగిలించాడన్న ఆరోపణలకు తమకెలాంటి ఆధారమూ లభించలేదని జాత్రాపూర్ పోలీసు అధికారి నందన్ దాస్ తెలిపారు. మృతుడి తండ్రి జమాల్ మియా చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇద్దరు నిందితులు సెంటు దేవ్నాద్, అమర్ చంద్ర దాస్‌లను అరెస్టు చేశారు. వారిద్దరిని అరెస్టు చేయడం పట్ల స్థానికంగా ఉన్న హిందూత్వ శక్తులు రెచ్చిపోయాయి. నిందితులను విడుదల చేయాలంటూ రోడ్లను బ్లాక్ చేశాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక వర్గం వారినే లక్ష్యంగా చేసుకుంటూ మూకదాడులు నిత్యకృత్యమయ్యాయని రాజకీయ విశ్లేషకులు ఆందోళనను వ్యక్తం చేశారు.