Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిలిప్పో ఒసెల్లా బహిష్కరణపై దృష్టి సారించండి
- ప్రధాని మోడీకి కేరళ సీఎం లేఖ
న్యూఢిల్లీ : గతవారం తిరువనంతపురం విమానాశ్రయం నుంచి ప్రముఖ ఆంత్రోపాలజిస్టు ఫిలిప్పో ఒసెల్లాను బహిష్కరించిన విషయాన్ని పరిశీలించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. భారతదేశానికి '' విదేశీ స్కాలర్లు, సామాజిక శాస్త్రవేత్తలను స్వాగతించే గొప్ప సంప్రదాయం ఉన్నది'' అని ఆయన వివరించారు. ఈ విషయాన్ని అర్హమైన తీవ్రతతో చూడాలనీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని ప్రధానిని విజయన్ కోరారు. యునైటెడ్ కింగ్డమ్లోని యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్లో ఆంత్రోపాలజీ అండ్ సౌత్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ ఒసెల్లా.. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సెమినార్కు హాజరయ్యేందుకు వచ్చినట్టు విజయన్ వివరించారు. సెమినార్లో పాల్గొనడానికి వచ్చిన ప్రొఫెసర్ ఒసెల్లా వంటి ప్రఖ్యాత ఆంత్రోపాలజిస్టు తిరువనంతపురం విమానాశ్రయంలో బహిష్కరణను ఎదుర్కోవలిసి రావడం బాధాకరమని పేర్కొన్నారు. మార్చి 24న బహిష్కరణ తర్వాత.. ఎలాంటి వివరణ లేకుండా తనకు భారత అధికారులు ప్రవేశాన్ని నిరాకరించారని ఒక వార్త సంస్థకు పంపిన ఈ-మెయిల్లో ఒసెల్లా పేర్కొన్నారు.