Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రివర్గ నిర్ణయం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలివెన్స్ (డీఏ), పెన్షన్ దారులకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) మూడు శాతం పెంపునకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ, పెన్షన్దారులకు డీఆర్ ప్రస్తుతం 31శాతంగా ఉంది. దానికి 3శాతం పెంచుతూ కేంద్ర మంత్రి నిర్ణయం తీసుకుంది. ఇది 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. దేశంలో 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల ప్రతి ఏటా ప్రభుత్వంపై రూ.9,544.50 కోట్ల భారం పడుతుందని మంత్రి వర్గం తెలిపింది.
రూ.6,062 కోట్లతో ఎంఎస్ఎంఈ కార్యక్రమం
''ఎంఎస్ఎంఈ పనితీరును పెంచటం, వేగవంతం చేయడం (ఆర్ఏఎంపీ)'' కార్యక్రమానికి 808 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.6,062.45 కోట్లు)కు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కొత్త పథకం ప్రారంభమవుతుంది. అందుకోసం అయ్యే వ్యయంలో 500 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.3,750 కోట్లు) ప్రపంచ బ్యాంక్ రుణం తీసుకునేందుకు మంత్రి వర్గం ఆమోదించింది. మిగిలిన 308 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.2,312.45 కోట్లు) కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుంది.