Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ లేఖ రైతుల పాలిట శాపంగా మారింది
- చివరి గింజ కొనిపించే వరకు కాంగ్రెస్ ఉద్యమం
- రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా పాల్గొంటారు
- కేటీఆర్‌కు చరిత్రపై అవగాహన లేదు
- హరిత విప్లవం నుంచి ఉచిత విద్యుత్, రుణ మాఫీ అన్నీ కాంగ్రెస్‌వే: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొనకుండా రాజకీయాలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో పండించిన
చివరి గింజ కోనేదాకా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతున్నదని హెచ్చరించారు. ''కేంద్రం కొంటలేదు కాబట్టి వరి వద్దంటే...కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదెందుకనిు? ప్రశ్నించారు. కేంద్రం కొంటే నీ ప్రభుత్వం దళారి పని చేస్తుందా? ప్రతిగింజ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 'కేంద్రం ఉన్నపళంగా మనసు మార్చుకొని వడ్లు కొంటామన్నా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ ముందు చూపు లేకుండా బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేంద్రానికి ఇచ్చిన లేఖ ఇప్పుడు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలేమో సెంట్రల్ హాల్లో ఫోటోలకు ఫోజులిస్తూ పోరాడుతున్నామని నాటకామాడుతున్నారని చెప్పారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేటీఆర్, కవిత, హరీశ్‌రావు ఎందుకుండరని ప్రశ్నించారు. రైతులు ఇంత కష్టాల్లో ఉంటే, కేసీఆర్ ఏమి చేస్తున్నారని నిలదీశారు. రైతుల పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే, జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి రూ 10వేల కోట్లు ఇస్తే ప్రతి గింజ కొని చూపిస్తామన్నారు. వరి వేయోదంటూ చెప్పిన సీఎం తన ఫామ్ హౌజ్‌లో 150 ఎకరాల్లో వరి పండించారనీ, కేసీఆర్ ధాన్యాన్ని కొనేవాళ్లు పేద రైతుల వడ్లు కొనరా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో ఇక వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణమెందుకు? రైతు బంధు ఎందుకని నిలదీశారు. రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కేటీఆర్‌కు కాంగ్రెస్ చరిత్ర, దేశ చరిత్రపై ఎలాంటి అవగహన లేదని విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అనుభవిస్తున్న తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. కేటీఆర్...మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తున్నద న్నారు. దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చింది కాంగ్రెసేనన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఒకే సంతకంతో దేశంలోని రైతులు రూ 70వేల కోట్లు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ 7వేల మంది రైతులను పొట్టనబెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.