Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పెరిగిన ఎరువులు, విత్తనాలు, రసాయనాల ధరలు
రైతుల ఆదాయం డబుల్ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్..అందుకు తగ్గ ప్రయత్నం చేసిందా? అంటే..లేదు. 8ఏండ్లలో ఇప్పటివరకూ విధానపరంగా ఎలాంటి చొరవా తీసుకోలేదు. ఆదాయం సంగతేమోగానీ.. సాగు వ్యయం భారీగా పెరిగింది. విత్తనాలు, ఎరువులు, రసాయనాలు, వ్యవసాయ పరికరాల ధరలు భరించలేనంతగా పెరిగాయి. మరోవైపు ద్రవ్యోల్బణం రికార్డ్‌స్థాయికి చేరుకుంది. ఇదంతా.. రైతుకు దక్కే స్వల్ప ఆదాయాన్ని మింగేశాయి. అందువల్లే గ్రామాల్లో కొనుగోలు శక్తి పెరగటం లేదు. పేదరికం తగ్గటం లేదు. దేశ రైతాంగాన్ని ఆదుకునే ఆలోచన లేకపోవటం వల్లే నేడు ఈ పరిస్థితి ఏర్పడింది.
- కోటక్ ఈక్విటీస్ తాజా అధ్యయనం
- దీనికి తోడు ద్రవ్యోల్బణం...
- ఇవన్నీ లెక్కేసుకుంటే.. మిగిలేది అప్పులే
- అందువల్లే గ్రామాల్లో కొనుగోలు శక్తి పెరగటం లేదు : 'కోటక్ ఈక్విటీస్' నివేదిక
- ఈ ఏడాది ఇన్పుట్ వ్యయం 15శాతం పెరిగింది
- సమస్యల సుడిగుండంలో రైతాంగం
న్యూఢిల్లీ : ఆర్థిక పరిభాషలో..చెప్పాలంటే, దేశంలో నిత్యావసర సరుకులు, వస్తువుల ధరలు పెరగటాన్ని 'ద్రవ్యోల్బణం'గా పేర్కొంటారు. సగటు కుటుంబం ఆదాయం ఓ వైపు భారీగా పడిపోగా, మరోవైపు మన దేశంలో అన్నింటి ధరలూ విపరీతంగా పెరుగుతున్నాయి. పంట సాగులో రైతుల పెట్టుబడి వ్యయమూ భారీగా పెరిగింది. విత్తనాలు, ఎరువులు, రసాయనాలు, వ్యవసాయ పరికరాల(ఇన్పుట్ కాస్ట్) ధరలు భరించలేనంతగా మారాయి. వ్యవసాయరంగంలో ఇన్పుట్ కాస్ట్ 15శాతం వరకు పెరిగిందని 'కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్' తాజా నివేదిక పేర్కొన్నది. ఓ వైపు అనూహ్యంగా పెరిగిన ద్రవ్యోల్బణం, మరోవైపు ఇన్పుట్ కాస్ట్ వ్యయం..ఇదంతా రైతాంగాన్ని కోలుకోలేనంతగా దెబ్బతీస్తున్నాయని, పెరిగిన ధరలకు చిన్న, సన్నకారు రైతుల ఆదాయానికి పొంతనే ఉండటం లేదని ఈ నివేదిక తెలిపింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని పదే పదే చెబుతున్న మోడీ సర్కార్, ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయలేదని నివేదిక అభిప్రాయపడింది. అందువల్లే దేశ రైతాంగంలో తీవ్ర నిరాశ, నిస్ప్రృహ నెలకొందని, పేదరికం, నిరక్షరాస్యత తీవ్రస్థాయిలో ఉందని తెలిపారు.
ఈ నివేదికలో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. భరించశక్యం కాని ఈ ధరలతో సాగు చేయలేమనే ఆందోళనలో చిన్న, సన్నకారు రైతులున్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగాయని, దేశీయంగా అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ), పొటాష్, సల్ఫర్, ఫాస్ఫర్, యూరియా..ధరలన్నీ ఒక్కసారిగా పెరిగాయి. యూరియాను దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటున్నామని, సబ్సిడీ యూరియా సరఫరా చేస్తున్నామని కేంద్రం చెబుతున్నా, చాలా కొద్ది మంది రైతులకు..అదీ అరకొరగా సబ్సిడీ యూరియా అందుతోంది. కాబట్టి తన సాగు అవసరాలను తీర్చుకోవాలంటే బహిరంగ మార్కెట్లో రైతు మళ్లీ యూరియాను కొనుగోలు చేయాల్సిందే.
దేశీయంగా బహిరంగ మార్కెట్లో అమ్ముతున్న అమ్మోనియా ధర 244శాతం, సల్ఫర్ ధర 83శాతం, ఫాస్పారిక్ ధర 67శాతం పెరిగాయి. పెరిగిన ధరల నేపథ్యంలో రైతుకు వచ్చే ఆదాయం సున్నా అవుతోంది. పెట్టిన పెట్టుబడి రాకపోగా, చేసిన అప్పులు ఒక్కొక్కటీ తలకుమించిన భారంగా మారుతున్నాయి. అందువల్లే రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, పేదరికం, నిరక్షరాస్యత భారీ స్థాయిలో ఉందని నివేదిక అభిప్రాయపడింది. ఈ పరిస్థితిని నివారించే ప్రయత్నం కేంద్రం చేయటం లేదని, విధానపరమైన చర్యలు లేకపోవటమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.
ఇంకా ఎంత పెరుగుతాయో?
ఉక్రెయిన్ సంక్షోభాన్ని చూపి ఇంధన ధరల్ని మోడీ సర్కార్ భారీగా పెంచింది. అదే విధంగా ముందు ముందు ఎరువులు, రసాయనాలు, యూరియా ధరలూ పెద్దమొత్తంలో పెరుగుతాయని 'కోటక్ ఈక్విటీస్' అంచనావేసింది. ప్రాథమిక ఎరువులుగా పేర్కొనే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ వీటి దిగుమతుల్లో 60శాతం రష్యా నుంచే భారత్ కొనుగోలు చేస్తోంది. శుద్ధిచేసిన పొటాష్ ఎక్కువగా బెలారస్ నుంచి వస్తోంది. సంక్షోభం కారణంగా వీటి దిగుమతులు ఏస్థాయిలో ఉంటాయో తెలుపలేం. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందే. కాబట్టి వీటి ధరలు ముందు ముందు పెరిగటం ఖాయంగా కనిపిస్తోంది.
ఎంఎస్పీ పెంచాలి...
మోడీ సర్కార్ విధానాలు సగటు రైతు కుటుంబం, రైతు కూలీల ఆదాయాల్ని దెబ్బతీస్తున్నాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన ఇన్పుట్ వ్యయంను దృష్టిలో పెట్టుకొని పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని కేంద్రం పెంచాలి. లేదంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. రైతు బాగుంటేనే వ్యవసాయేతర కుటుంబాలకు ఆదాయం దక్కుతుంది. లేదంటే వీరు కూడా ఉపాధి సమస్యను ఎదుర్కొంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడానికి ఎంఎస్ఎపీ ఎంతగానో దోహదం చేస్తుంది. క్రితం ఏడాదితో పోల్చితే ఏప్రిల్-నవంబర్ 2021 మధ్య వేతనాల్లో వృద్ధి 6.6శాతం నుంచి 2.35శాతానికి తగ్గింది. అలాగే వ్యవసాయేతర కూలీలకు వేతనాల్లో వృద్ధి 8శాతం నుంచి 1.8శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం రికార్డ్‌స్థాయిలో పెరిగింది. దీనిని కూడా పరిగణలోకి తీసుకుంటే కొనుగోలు శక్తి భారీస్థాయిలో పడిపోయింది. 2016తో పోల్చితే 2020నాటికి వ్యవసాయ కూలీల వేతనాల్లో వృద్ధి ఒక్క శాతం కూడా లేదు. ఈ పరిణామాలన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్ని బలహీనంగా మార్చాయి. అందువల్లే ఉపాధి హామీ పనులకు డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో మోడీ సర్కార్ 'ఉపాధి హామీ' పథకానికి నిధుల్లో 25శాతం కోత పెట్టింది.